కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్: ఉద్యోగుల విభజనపై దృష్టి: వర్క్ టు సర్వ్: అప్పటిదాకా గడువు
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. తుది నోటిఫికేషన్‌పై కసరత్తు ముమ్మరం చేస్తోంది. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు అందిన విజ్ఞప్తులన్నింటినీ తెప్పించుకుంటోంది. తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి ఉద్దేశించిన గడువు సమీపిస్తోండటంతో- దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని ప్రాంతాల ప్రజల డిమాండ్లు, మనోభావాలను గౌరవిస్తూ తుది నోటిఫికేషన్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఏప్రిల్ 2 నుంచి..
రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల రాకతో రాష్ట్ర స్వరూపం సమూలంగా మారిపోనుంది. హద్దులన్నీ అటు ఇటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ..భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ సమదూరంలో జిల్లా కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.

మార్పులు చేర్పులతో తుది నోటిఫికేషన్..
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రస్తుతం ప్రజాభిప్రాయాలను సేకరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని- ఇదివరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మళ్లీ మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను గుర్తిస్తూ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మార్పులు చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి భారీగా అందుతున్నాయి.

సీమలో మరిన్ని..
ఈ పరిణామాల మధ్య రాయలసీమలో కొత్త జిల్లాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అదనంగా మరో రెండింటిని ఏర్పాటు చేయాలని రాయలసీమ మేధావుల వేదిక డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ వాటా అధికం. రాయలసీమ విస్తీర్ణం 42 శాతంగా ఉంటోంది. విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుంటే- అదనంగా మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని మేధావుల వేదిక ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

మదనపల్లి కేంద్రంగా..
చిత్తూరు జిల్లాలో మారుమూలన ఉన్న మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఆదోని లేదా అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణాలు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మూడు కొత్త జిల్లాల కోసం రాయసీమ మేధావుల ఫోరం ప్రతినిధులు పట్టుబడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తమ డిమాండ్‌ను వినిపించారు. కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేశారు.

మార్చి 3 వరకు ప్రజాభిప్రాయ సేకరణ..
కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చేనెల 3వ తేదీ వరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించనుంది. 3వ తేదీ వరకు స్థానికులు తమ విజ్ఞప్తులను కలెక్టర్లకు అందజేసే అవకాశాన్ని కల్పించింది. వాటన్నింటినీ క్రోడీకరించి, అందిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ మరుసటి నెల 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది.
Recommended Video

ఉద్యోగుల విభజనా అప్పుడే..
తుది నోటిఫికేషన్‌తో పాటు ఉద్యోగు అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను కూడా ప్రభుత్వం ఏకకాలంలో పూర్తి చేయనుంది.పదోన్నతులు, సర్వీస్‌కు ఇబ్బందులు ఉండబోవనే హామీ ఇచ్చింది. వర్క్ టు సర్వ్ కింద ఉద్యోగులను ప్రభుత్వం కొత్త జిల్లాలకు కేటాయిస్తుంది. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లు నిర్మించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండేలా ఇవి రూపుదిద్దుకోనున్నాయి.












Click it and Unblock the Notifications