విభజన తీరు మనోభావాలను దెబ్బతీసింది: గవర్నర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన తీరు మెజార్టీ తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ అన్నారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షకు విభజన తీరు సానుకూలంగా లేదని అన్నారు. విభజనతో ఏపి ప్రజలకు అస్తవ్యస్త రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. ఏపి ప్రజలు ఆస్తులను కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, నమ్మకానికే ఓటు వేశారని నర్సింహన్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.విజన్ 2020ని అమలు చేస్తామని చెప్పారు. సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు కేంద్రం సాయం కోరతామని చెప్పారు. 2029నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఏపిని చేరుస్తామని చెప్పారు.

రైతుల రుణ మాఫీకి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అన్నారు. ఆర్డినెన్స్ ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక కారిడార్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గృహ, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. అందరికీ విద్యకు కట్టుబడి ఉణ్నామని అన్నారు.
మహిళ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద రూ. 30వేలు డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం కింద రూ. 10 వేలు అందజేస్తామన్నారు. బీసీల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల ప్రయోజనాలకు ఆటంకం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను మారుస్తామని చెప్పారు. 50ఏళ్లు దాటిన గిరిజనులకు రూ. 1000 పింఛన్ అందిస్తామని తెలిపారు.
కృష్ణా, గోదావరి నదులకు అథారిటీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిపారు. పారదర్శక పాలన కోసం ఆన్‌లైన్ ఫైల్ మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
సుస్థిర అభివృద్ధిని సాధిస్తామన్నారు. కొత్త ఐటి విధానం అమలు చేస్తామని చెప్పారు. ఏపిని స్వర్ణాంధ్రను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలను మెగా సిటీలుగా మారుస్తామన్నారు. రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు. సింగపూర్, జపాన్ తరహా అభివృద్ధిని సాధిస్తామన్నారు. ఎన్నికల హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఏపికి 15ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అనంతపురం, విజయవాడల్లో ఐటిని అభివృద్ధి చేస్తామని, విశాఖపట్నం, తిరుపతిల్లో ఐటిఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌లో కొత్త శకం ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర సాయంతోనే ఏపి అభివృద్ధి సాధ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications