అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టు
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్న భూమా అఖిలప్రియ తన అనారోగ్య కారణాల దృష్ట్యా, తాను గర్భవతి అయిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సికింద్రాబాదు కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. వాదనలు విన్న కోర్టు ఈ కేసును రేపటికి వాయిదా వేసింది.
ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్

సికిందరాబాద్ కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపించిన అఖిల తరపు న్యాయవాది
ముగ్గురు వ్యాపారవేత్త లైన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసును తక్కువ సమయంలో చేధించిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భూమా అఖిలప్రియ ను అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియకు కోర్టు రిమాండ్ విధించగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అఖిల ప్రియ కోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియ తరఫు న్యాయవాది ఈ రోజు సికిందరాబాద్ కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపించారు .

అఖిలప్రియకు 41 సి ఆర్ పి సి నోటీసులు కూడా ఇవ్వలేదన్న న్యాయవాది
ఏ2 గా ఉన్న అఖిలప్రియను ఏ1 గా మార్చారని అంతేకాకుండా ప్రజాప్రతినిధిగా ఉన్న అఖిలప్రియకు 41 సి ఆర్ పి సి నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉందని జైలు అధికారులు ఈ రోజు వెల్లడించిన విషయం తెలిసిందే . ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.

కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్టు ఆదేశం ..రేపటికి విచారణ వాయిదా
ఈ వ్యవహారంలో కోర్టు కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. రేపటికి ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది రేపు తేలనుంది. మరోపక్క భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పట్టుబడలేదు. ముందు ముందు ఈ కేసు మరెన్ని కీలక మలుపులు తిరుగుతుందో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది .