వెనుక కూర్చొన్నా హెల్మెట్, లేకుంటే - హైకోర్టు తాజా ఆదేశాలు..!!
హెల్మెట్ వినియోగం పై ఏపీ హైకోర్టు మరోసారి స్పందించింది. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని పోలీసులను ప్రశ్నించింది. మోటార్ వాహ నాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది.
ఆదేశాలు అమలు చేయరా
ఏపీలో హెల్మెట్ వినియోగం పై తామిచ్చిన ఆదేశాలు అమలు కాకపోవటం పైన హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించింది. నిబంధనల అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారనే సంకేతాలు వెళ్లేలా వ్యవహరించాలని నిర్దేశించింది. పోలీసులు రోడ్లపై నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధించి అక్కడికక్కడే వసూలు చేస్తే రెండునెలల్లో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది.

వెనుక కూర్చొన్న వారికి ఇక
వాహనాలు నడుపుతున్న వారిలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్ చర్యలు కూడా తగ్గుతాయని పేర్కొంది.
హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన దారులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులకు తేల్చి చెప్పింది. నిర్ధిష్ఠ గడువులోగా చలాన్లను చెల్లించనివారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టంలోని సెక్షన్ 206 ప్రకారం వాహనదారుల లైసెన్స్‌లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసింది
అమలు చేయాల్సిందే
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది హెల్మెట్ ధరించని కారణంగా చనిపోయా రని పేర్కొంది. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటే వారిలో కొందరి ప్రాణాలు అయినా దక్కేవని వ్యాఖ్యానించింది. అదే విధంగా ఆటో డ్రైవర్లు పరిమితికి మంచి స్కూలు పిల్లలను తీసుకెళ్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications