విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ లో తాజా మార్పులు..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న వాటితో పాటుగా మరో రెండు వందేభారత్ ప్రవేశ పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ పైన త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక, విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ అప్ గ్రేడ్ కానుంది. నేటి నుంచి ఈ రైలులో కొత్త మార్పులు అందుబాటులోకి రానున్నాయి.
వందే భారత్ అప్ గ్రేడ్
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రారంభమైన తొలి వందేభారత్ కు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. ఈ రైలుకు ఉన్న డిమాండ్ తో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలును అప్ గ్రేడ్ చేస్తూ రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం 16 కోచ్ లతో నడుస్తున్న ఈ రైలు నేటి నుంచి 20 కోచ్ లతో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిత్యం వెయిటింగ్ లిస్టు ఉంటున్న ఈ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణీకులు ఈ రైలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

నేటి నుంచి 20 కోచ్ లు
కొంత కాలంగా ఈ రైలులో కోచ్ ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖకు వినతులు అందాయి. దీంతో, రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఇప్పుడు మరో నాలుగు కోచ్ లు పెంచుతూ అధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త వందే భారత్ రైళ్ల ప్రతిపాదనల పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ ను పట్టాలు ఎక్కించేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ కేటాయించేలా రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. తొలి వందేభారత్ స్లీపర్ విశాఖ నుంచి తిరుపతికి అందుబాటులోకి రానుంది.
వందేభారత్ స్లీపర్
ఇక, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందేభారత్ స్లీపర్, విజయవాడ నుంచి అయోధ్య కు మరో రైలు పైనా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటి పైన రెండో విడతలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక.. బెంగళూరు కు సైతం ఏపీ నుంచి వందేభారత్ నడపాలనే వినతులు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని.. విడతల వారీగా కేటాయింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తొలి విడత లోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ కేటాయింపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications