vizag lg polymers visakhapatnam andhra pradesh ys jagan ysrcp avanthi srinivas విశాఖపట్నం వైజాగ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ వైసీపీ అవంతి శ్రీనివాస్ politics
బతుకు జీవుడా.. అర్ధరాత్రి వేళ రోడ్ల పైకి వేలాదిమంది.. విశాఖలో మళ్లీ అలజడి..
గురువారం(మే 6) తెల్లవారుజామున జరిగిన విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన స్థానికుల గుండెల్లో దడ పుట్టించింది. బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్న వేళ అర్ధరాత్రి మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవడం మరింత ఆందోళనకు గురిచేసింది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వేలాది మంది స్థానికులు ఇళ్లు వదిలి రోడ్లపై పడ్డారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోగా.. మరికొందరు కాలినడకనే సురక్షిత ప్రాంతాలకు నడిచి వెళ్లారు.

అర్ధరాత్రి భారీ ట్రాఫిక్ జామ్
అర్ధరాత్రి వేళ గ్యాస్ లీకేజీ జరగడంతో ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి చేరారు. అక్కడినుంచి వాహనాల్లో లేదా కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో అర్ధరాత్రి సమయంలో బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోసారి గ్యాస్ లీకేజీతో చుట్టుపక్కల 5 కి.మీ పరిధిలోని ఇళ్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

పేలుడుపై వదంతులు.. నమ్మవద్దన్న కమిషనర్
భారీగా గ్యాస్ లీకేజీ జరగడంతో పేలుడు సంభవిస్తుందేమోనన్న భయాందోళన స్థానికుల్లో నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని తరలిస్తున్నారని భావించారు. కానీ లీకేజీని అరికట్టే సమయంలో పేలుడు సంభవిస్తుందనేది వట్టి పుకారు అని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. గ్యాస్ లీకేజీని అరికట్టే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని.. అయితే పేలుడు సంభవించే అవకాశం లేదని అన్నారు. కాబట్టి ప్రజలెవరూ పుకార్లను నమ్మవద్దన్నారు.

గ్యాస్ లీకేజీను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న నిపుణులు
పుణే ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ నుంచి యుద్దప్రాతిపదికన తెప్పించిన 500 కిలోల పీటీబీసీ(పారా టెర్షియరీ బ్యుటైల్ కెటెహాల్) అనే రసాయన ద్రావకంతో గాల్లో కలిసిన స్టైరెన్‌ను నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని, నేడు శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.