తిరుమలలో వారికి డెడ్ లైన్: మే 15 లోగా
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 79,878 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,037 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.94 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. దీనిపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులను ఆదేశాలు జారీ చేశారు. తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహంలో ఈ సమావేశం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలను భక్తులకు విక్రయించాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. హోటళ్లలో సాంప్రదాయ ఆహారం మాత్రమే విక్రయించాలని, హోటల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని చెప్పారు. హోటళ్లలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరం జనతా క్యాంటీన్ల నిర్వాహకులతో ఆయన సమావేశం అయ్యారు. నిబంధనల ప్రకారం భక్తులకు అందుబాటు ధరలో ఆహారాన్ని విక్రయించాలని చెప్పారు.
అనంతరం కాటేజీ డోనార్ స్కీమ్ ద్వారా తిరుమలలో విశ్రాంతి గృహాలు నిర్మిస్తున్న దాతలతో అదనపు ఈవో సమావేశం అయ్యారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి మే 15 లోగా విశ్రాంతి గృహాలను టీటీడీకి అప్పగించాలని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న ప్రతి విశ్రాంతి గృహంలో జనరేటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
బిగ్ క్యాంటీన్లు:
1. శ్రీవత్స బిగ్ క్యాంటీన్- అడయార్ ఆనంద భవన్ స్వీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై
2. కౌస్తుబం బిగ్ క్యాంటీన్- ధంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
3. సందీప బిగ్ క్యాంటీన్ - ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
4. సప్తగిరి బిగ్ క్యాంటీన్ - సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మదాబాద్
5. శ్రీ వెంకటేశ్వర బిగ్ క్యాంటీన్ - శ్రీ సుఖ్‌సాగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై
జనతా క్యాంటీన్లు
1. PAC (WEST) జనతా క్యాంటీన్ - త్రివర్గ ఫుడ్ అండ్ బేవరేజెస్, విజయవాడ
2. PAC (NORTH) - జనతా క్యాంటీన్ - శ్రీ రాఘవేంద్ర వెజ్ రెస్టారెంట్, హైదరాబాద్
3. SMC జనతా క్యాంటీన్ - సంతోష్ ధాబా ఎక్స్‌క్లూజివ్ A/C (సంతోష్ కాజిల్), హైదరాబాద్
4. HVC జనతా క్యాంటీన్ - శ్రీదేవి హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై
5. MMT జనతా క్యాంటీన్ - పృథ్వీ హాస్పిటాలిటీ సర్వీసెస్, పూణే.












Click it and Unblock the Notifications