బిగ్ అప్‌డేట్: తిరుపతి- సికంద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు
Vande Bharat Express: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు ఏకం అయ్యాయి. చెరువులు, కుంటలు ఎక్కడికక్కడె తెగిపోయాయి. వరదనీరు జనావాసాల్లోకి పోటెత్తింది.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నేడు కూడా అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాల ధాటికి అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాలో రైల్వే పట్టాలపై వరద నీళ్లు ప్రవహించాయి. ట్రాక్ చాలావరకు ధ్వంసమైంది. పట్టాల కింద భూమి పలు చోట్ల కోతకు గురైంది.
దీని ప్రభావం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై పడింది. ఆలస్యంగా ఈ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో పలుచోట్ల పట్టాలపై వరదనీరు ప్రవహిస్తోండటం వల్ల షెడ్యూల్ ప్రకారం నడవట్లేదు. ఈ తెల్లవారు జామున సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వందే భారత్.. చాలా ఆలస్యంగా తిరుపతికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఫలితంగా.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన నంబర్ 20702 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు. రాత్రి 8:15 నిమిషాలకు ఈ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications