AP Elections: ఓట్ల నమోదుకు ఇవాళే లాస్ట్ ఛాన్స్..! రిజిస్ట్రేషన్ ఇలా..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే లోక్ సభ తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అయితే తెలుగు రాష్టాల్లో ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఏదైనా కారణంతో ఓటును నమోదు చేసుకోలేని వారికి ఈసీ చివరి అవకాశం ఇస్తోంది.

ఇప్పటికే ఈసీ తయారు చేసి విడుదల చేసిన ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదా ఓటర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో పేరు మిస్సయినా, ఇప్పటివరకూ ఓటు నమోదు చేసుకోకపోయినా ఇవాళ ఒక్కరోజు ఓట్ల నమోదుకు అవకాశం ఉంది. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్న వారు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఈసీ ఇవాళ చివరి అవకాశం ఇస్తోంది. ఇవాళ దరఖాస్తు చేసుకున్న ఓట్లను వారం రోజుల్లో పరిశీలన చేసి ఓటు హక్కు కల్పిస్తారు.
ఇవాళ ఓటు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండిన ఓటర్లు www.nvsp.in వెబ్ సైట్ లోకి వెళ్లి కొత్త ఓటరు నమోదు ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫామ్ 6 ఓపెన్ అవుతుంది. ఇందులో వివరాలన్నీ నింపి సబ్మిట్ చేస్తే రిఫరెన్స్ ఐడీ జనరేట్ అవుతుంది. దాన్ని ఉపయోగించి ఓటు రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in/ లేదా https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్లలోకి వెళ్లి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు.
అలాగే ప్లే స్టోర్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లోకి వెళ్లి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. వీటిపై అవగాహన లేకపోతే నేరుగా స్ధానికంగా ఉండే బూత్ లెవల్ అధికారిని సంప్రదించి ఓటు నమోదు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే 1950కు ఫోన్ చేయొచ్చు. ఇలా వచ్చిన దరఖాస్తుల్ని వారం లోగా పరిశీలించి అధికారులు ఓటు హక్కు కల్పిస్తారు.












Click it and Unblock the Notifications