నేడు నెల్లూరులో పవన్ కల్యాణ్ పర్యటన...ఆలీతో కలసి రొట్టెల పండుగ పాల్గోనున్న జనసేనాని
నెల్లూరు:పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ నటుడు ఆలీతో కలసి రొట్టెల పండుగకు హాజరవడంతో పాటు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ప్రముఖ కమెడియన్ ఆలీ జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ తో కలసి ఈ పర్యటన నిర్వహిస్తుండటం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. గతంలో సన్నిహితులైన వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్లు, అందువల్లే అజ్ఞాతవాసిలో ఆలీ నటించలేదని, ఆలీ టిడిపి తరుపున బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ తాజా పరిణామంతో ఆలీ జనసేనలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ నెల్లూరు పర్యటన...ఆలీతో కలసి
ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన చిరకాల మిత్రుడు, సినీ నటుడు అలీతో కలిసి ఆదివారం ఉదయం 11గంటలకు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ప్రార్ధనలు నిర్వహించనున్నట్లు తెలిసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంటకు విమానంలో బయలుదేరిన పవన్ కల్యాణ్ అక్కడనుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకుంటారు.

రొట్టెల పండుగ...దర్గాలో ప్రార్థనలు
పవన్ కళ్యాణ్ తొలుత నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో ఆలీతో కలసి పాల్గొన్న అనంతరం బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి స్వర్ణాల చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.

విభేదాలకు...స్వస్థి
కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్, అలీ వద్ద విభేదాలు వచ్చాయని, ఆ గొడవల కారణంగానే ఆలీకి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో అవకాశం కూడా ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఆ ప్రకారమే ఆ తరువాత వీరిద్దరూ కలసి కనిపించకపోవడంతో ఆ వదంతులు నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడింది. తనకు రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసిన ఆలీ ఆ తరువాత టిడిపి తరుపున బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే గతంలో ఒక సందర్భంలో
సినీరంగంలో తనకు బాగా మిత్రుడైన పవన్ కల్యాణ్ పార్టీ పెడితే తాను కూడా అందులో చేరుతానని ప్రకటించడం కూడా గమనార్హం.

జనసేన తరుపున...బరిలో ఖాయమా?
తాజా పరిణామాన్ని బట్టి ఆలీ ఇక జనసేన పార్టీలో చేరడం ఖాయమేనని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా తనతో పాటు నెల్లూరు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనే అవకాశం ఆలీకి ఇవ్వడంతో ఇక ఆలీ రాజకీయ ప్రస్థానం లాంఛనమేనని తెలుస్తోంది. అంతేకాదు రాజకీయపరంగా తనకు అనుకూలంగా ఉండే చోట జనసేన తరుపున ఆలీ బరిలోకి దిగడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications