విభజనపై భేటీ: చివరిదని జైరాం, కాకపోవచ్చునని షిండే
న్యూఢిల్లీ: మంత్రుల బృందం (జివోఎం) సమావేశం పైన కేంద్ర మంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. గురువారం జరగబోయే సమావేశమే చివరిది కాకపోవచ్చునని, మరో ఒకటి రెండు సమావేశాలు జరిగే అవకాశముందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పగా, మరో మంత్రి, జివోఎం సభ్యులు జైరామ్ రమేష్ మాత్రం రేపటి సమావేశమే తుదిది అని చెబుతున్నారు.
బుధవారం వారిద్దరిని జివోఎం భేటీ, నివేదికపై మీడియా ప్రశ్నించింది. రేపు జరగబోయే భేటీ ఆఖరుదని జైరామ్ రమేష్ చెప్పారు. అయితే రేపటి భేటీకి జివోఎం నివేదిక వస్తుందా అని ప్రశ్నిస్తే ఆ విషయాన్ని షిండేను అడగాలని సూచించారు.

అంతకుముందు షిండే మాట్లాడుతూ... తాము పెద్ద నిర్ణయం తీసుకుంటున్నామని, తొందరేముందని వ్యాఖ్యానించారు. గురువారం జరగబోయే కేబినెట్ సమావేశంలో జివోఎం నివేదిక రాకపోవచ్చునని చెప్పారు.
అలాగే రేపటిదే జివోఎం చివరి సమావేశం కాకపోవచ్చునన్నారు. ఇంకా ఒకటి రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు. అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచించాలన్నారు.
కాగా, జివోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. గతంలో తాము ఇచ్చిన అంశాలను నేతలు మరోసారి గుర్తు చేయనున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నేతలు జైరాం రమేష్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications