నేడే సంపూర్ణ చంద్రగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాల మూసివేత!
ఆదివారం పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని దాదాపు 85 శాతం మంది చూసే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షికంగా కనిపిస్తుంది చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.
చంద్రగ్రహణం ఏర్పడే కాలం ఇదే
ఈరోజు రాత్రి 8 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై 11 గంటల నుండి 12 గంటల 22 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై అయిదు నిమిషాలకు గ్రహణం వీడుతుంది. ఇక ఆకాశంలో మేఘాలు లేకపోతే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, ముంబై ఢిల్లీలలో చూడవచ్చు.

ఈ చంద్ర గ్రహణం దేశమంతా చూడొచ్చు
ఈ చంద్రగ్రహణం దేశమంతటా కనిపిస్తుందని, దీనిని చూడడానికి బైనాక్యులర్ లు అవసరం లేదని ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు ఎం శ్రీ రఘునందన్ పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అని ప్రచారం జరుగుతుందని, అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి ఎటువంటి ప్రత్యేకత లేదని, ఈ సంవత్సరం ఏర్పడుతున్న మూడవ చంద్రగ్రహణం ఇది అని చెబుతున్నారు.
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
ఇదిలా ఉంటే నేడు చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు అన్నింటిని మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయాలను తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఇక రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం మూడున్నర నుండి 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు మూసి వేస్తున్నారు. గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసి వేయడం మొదటి నుండి ఉన్న ఆనవాయితీ.
పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసిన టిటిడి
తిరుమల శ్రీవారి భక్తులకు గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమలకు రావాలని సూచిస్తున్నారు గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెల నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ సేవలను కూడా టిటిడి రద్దు చేసింది.
దుర్గ గుడి, శ్రీశైలం ఆలయాల మూసివేత
మరోవైపు చంద్రగ్రహణం కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం మూడున్నర నుండి దుర్గ గుడితో పాటు ఉపాలయాలు కూడా మూసివేస్తారు. 8వతేదీ తెల్లవారుజామున 3గంటలకు మళ్లీ తలుపులు తెరిచి స్నపన అభిషేకాల అనంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనాలను ప్రారంభిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట నుండి 5 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు.
తెలంగాణాలోనూ యాదగిరి గుట్ట సహా ప్రముఖ ఆలయాల మూసివేత
చంద్రగ్రహణం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రముఖ దేవాలయాలను మూసి వేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి గ్రహణం ముగిసిన తర్వాత, ఆలయాలను సంప్రోక్షణ చేసి, పూజాధికాలను నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయాల నిర్వాహకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications