andhra pradesh amaravati vijayawada selection Governor ap govt high court అమరావతి విజయవాడ ఎంపిక ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు హైకోర్టు
ఏపీ కొత్త ఎస్ఈసీపై ఉత్కంఠ- జగన్ ఛాయిస్ ఆయనే- గవర్నర్ ఓటు ఎవరికో ?
ఏపీలో దశాబ్దాల పాటు ఎందరో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసినా వారికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ వైసీపీ హయాంలో గతంలో టీడీపీ సర్కారు నియమించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో పోరు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటినుంచి ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది. ముఖ్యంగా వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగిన నిమ్మగడ్డ గత ఏడాది ప్రస్ధానం ఎస్ఈసీ అధికారాల్ని అందరికీ గుర్తుచేసింది. దీంతో ఇప్పుడు కొత్త ఎస్ఈసీ విషయంలో అటు వైసీపీ సర్కారుతో పాటు గవర్నర్ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్ధితి నెలకొంది.

ఏపీ కొత్త ఎస్ఈసీపై ఉత్కంఠ
ఏపీలో కొత్త ఎస్‌ఈసీ పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించింది. ఇందులో మాజీ సీఎస్ నీలం సాహ్నీతో పాటు మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లు శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరిని గవర్నర్ ఎంపిక చేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సాధారణంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఒకరిని గవర్నర్ ఎస్ఈసీగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నిమ్మగడ్డతో పోరు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు గవర్నర్ నిర్ణయానికి అడ్డంకిగా మారిపోయాయి.

ఎస్ఈసీ నియామకంలో సవాళ్లు ఇవే
గతంలో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించేందుకు ఆయన నియామకంలో లొసుగులను వెతికిన వైసీపీ ప్రభుత్వం.. ఆయన్ను తొలగించి జస్టిస్ కనగరాజ్‌ను నియమించేందుకు పంచాయతీ రాజ్ చట్టంలో నిబంధనలు మార్చింది. వీటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వ్యక్తినే గవర్నర్ ఎస్ఈసీగా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత హైకోర్టు ఈ నిబంధనను కొట్టేసింది. ఎస్‌ఈసీ ఎంపిక అధికారం పూర్తిగా గవర్నర్‌కే ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు పెండింగ్‌లో ఉంది. మరోవైపు గతంలో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ ఎస్ఈసీగా నియమించే వ్యక్తికి ఐదేళ్ల పదవీకాలం లేదా 65 ఏళ్ల వయసు ఉండాలని సూచించింది.

ఎసీఈసీగా జగన్ ఛాయిస్ ఆయనే ?
కొత్త ఎస్ఈసీగా ప్రభుత్వం సూచించిన మూడు పేర్లలో నీలం సాహ్నీ, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డిలో సీఎం జగన్ ఓటు శామ్యూల్‌కేనని తేలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ హోదా ఇచ్చి మరీ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్న నీలం సాహ్నీతో పాటు ప్రేమ చంద్రారెడ్డి పేర్లను డమ్మీగా మాత్రమే గవర్నర్‌కు పంపినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే శామ్యూల్‌వైపు మొగ్గుచూపుతున్న జగన్ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదిస్తారా లేక ఇందులో ఉన్న సవాళ్ల ఆధారంగా మరొకరిని ఎంపిక చేస్తారా అన్నది తేలడం లేదు.

కీలకంగా గవర్నర్ నిర్ణయం
ఎస్‌ఈసీ నియామకంపై ఏపీ హైకోర్టు తీర్పు ఆధారంగా గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకునే వీలుంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్‌లో ఉంది. అలా కాదని కేంద్రం నియమించిన టాస్క్‌ఫోర్స్ చెప్పినట్లుగా 65 ఏళ్ల వయసు నిబంధన పరిగణనలోకి తీసుకుంటే
దీని ప్రకారం తీసుకుంటే శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి అనర్హులవుతారు. అప్పుడు 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న నీలం సాహ్నీని ఎస్ఈసీగా నియమించాల్సి వస్తుంది. దీంతో గవర్నర్ ఇప్పుడు ఏ నిబంధనను ప్రామాణికంగా తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో గవర్నర్ ఇప్పటికే న్యాయ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.