విషాదం: కూతురి పెళ్లికార్డులు పంచి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
మరో ఐదు రోజుల్లో కుమార్తె వివాహం ఉందనగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఓడీ చెరువు మండలం నల్లగుట్ల పల్లికి చెందిన 55 సంవత్సరాల పద్మనాభరెడ్డి తన చిన్న కుమార్తె యశస్విని వివాహం ఘనంగా జరిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి పనులతో ఇల్లంతా హడావుడిగా మారింది. అయితే వివాహ వేడుకలకు బంధువులను ఆహ్వానించడానికి పెళ్లి పత్రికలు పంచడానికి స్వయంగా వెళ్లిన పద్మనాభరెడ్డిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నల్లగుట్ల పల్లికి చెందిన కొట్టాల పద్మనాభరెడ్డి బంధువులకు, మిత్రులకు వెడ్డింగ్ ఇన్విటేషన్ లను ఇచ్చి స్కూటీపై స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో, కదిరి హిందూపురం రహదారిపై నల్లగుట్ల పల్లి రోడ్డు మలుపు వద్ద వేగంగా వచ్చిన ఓ కారు వెనక నుండి ఢీకొట్టి, సుమారు 10 మీటర్ల మేర వాహనంపై ఉన్న పద్మనాభరెడ్డిని తోసుకెళ్ళింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పద్మనాభరెడ్డి తలకు బలమైన గాయమైంది.

తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న పద్మనాభరెడ్డిని స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే పద్మనాభరెడ్డి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సంతోషంగా వివాహ వేడుకలు జరుపుకోవాలని భావించిన ఆ కుటుంబంలో కుటుంబ పెద్ద కన్నుమూయడంతో వారంతా కన్నీరు మున్నీరుగా రోదించారు.
పెళ్లి పత్రికలు పంచి ఇంటికి తిరిగి వస్తారు అనుకుంటే కానరాని లోకాలకు చేరిపోయారు అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతుంది అని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న వరంగల్ మట్టెవాడలోని వేణు కాలనీకి చెందిన బొరిగం వెంకట నరసయ్య తన మూడో కుమార్తె హారిక పెళ్లి చేసి వధూవరులను ఆశీర్వదించి వివాహ వేదికపైనే కుప్ప కూలిపోయారు. ఇక ఈ ఘటన కూడా విషాదం మిగిల్చింది.












Click it and Unblock the Notifications