వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతకాకుంటే..: టీ-టీడీపీ, టీఆర్ఎస్ ఎత్తులు పైఎత్తులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బస్సుయాత్ర ప్రారంభానికి ముందు రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పెద్ద కుదుపు. శుక్రవారం టీ-టీడీపీ తెలంగాణవ్యాప్త బస్సుయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, గురువారం నాడే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలు సీఎం కేసీఆర్‌ను కలవడం, తాము తెరాసలో చేరతానని చెప్పడంతో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అప్రమత్తమయ్యారు.

వెంటనే అందుబాటులో ఉన్న తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. తీగల, తలసానిలు పార్టీ వీడటం, భవిష్యత్తు కార్యాచరణ, రేపటి నుండి ప్రారంభమయ్యే బస్సుయాత్రలో ఏం చెప్పాలనే విషయమై వారు చర్చించారు. గురువారం ఉదయం తలసాని, తీగలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర గౌడ్ కేసీఆర్‌ను కలిశారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని భావించారు.

అయితే, కేవలం తీగల, తలసాని, ఎమ్మెల్సీ మాత్రమే తెరాసలో చేరుతున్నారని చెప్పారు. ప్రకాశ్ గౌడ్, ధర్మారెడ్డిలు తెరాసలో చేరడం లేదని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు చెప్పారు. ఉదయం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్ గౌడ్ సాయంత్రం చంద్రబాబును కలిశారు. అయితే, రంగంలోకి దిగిన చంద్రబాబు.. టీ-టీడీపీ నేతల ద్వారా వారిని తిరిగి రప్పించుకోవడంలో విజయవంతమయ్యారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

TRS and TDP competitive strategies

సాయంత్రం ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. తాను పార్టీ వీడుతానని, ఎక్కడా చెప్పలేదన్నారు. ఐదేళ్లు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. రేపటి బస్సుయాత్ర పైన చంద్రబాబుతో చర్చించామన్నారు. తాను నియోజకవర్గ సమస్యల పైననే కేసీఆర్‌ను కలిశానని తెలిపారు. గతంలో కూడా కేసీఆర్‌ను కలిశానని చెప్పారు. తద్వారా మొదట నలుగురు తెరాస వైపు వెళ్తారని భావిస్తే.. తీగల, తలసానిలు మాత్రమే చేరనున్నారని తెలుస్తోంది.

తమ పార్టీని బలహీనపర్చేందుకు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంపై చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. రేపటి బస్సుయాత్రలో ఏం చేయాలనే విషయాన్ని వారికి చెప్పారు. విద్యుత్ విషయంలో తనను కేసీఆర్ తప్పు పడుతున్నారని, ఆయన ప్రయత్నించక తనను అంటే ఏం లాభమని, టీడీపీ చేతికిస్తే తెలంగాణకు విద్యుత్ సాధిస్తామని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బాబు సూచించారు.

కాగా, రేపటి నుండి తాము చేపట్టబోయే బస్సుయాత్ర అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ఇప్పుడు తలసాని, తీగలతో చేరికల డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. రేపటి బస్సుయాత్రలో కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేయాలని, అందుకు ధీటుగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బస్సుయాత్రకు ముందు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఎత్తు వేశాడని భావిస్తున్న టీడీపీ.. విద్యుత్ అంశాన్ని తమకు అప్పగిస్తే సాధిస్తామని చెప్పడం ద్వారా పైఎత్తు వేసినట్లుగా భావిస్తోంది.

ఇదే విషయమై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చేతకాకపోతే విద్యుత్ శాఖను టీడీపీకి అప్పగించాలని, విద్యుత్ సమస్యను పరిష్కరించి చూపిస్తామన్నారు. రైతులకు 7 గంటలపాటు విద్యుత్ అందిస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన కరెంట్ అందుతోందని, తెరాస ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా కొనలేదన్నారు. కాగా, చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒత్తిడి కారణంగానే ఆయన వివరణ ఇచ్చారనే వ్యాక్యలు వినిపిస్తున్నాయి.

English summary
Telangana Rastra Samithi and Telugudesam Party competitive strategies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X