తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. ఆదివారం 80,774 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,447 మంది తలనీలాలను సమర్పించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల కొద్దీ సమయం పట్టింది.
కాగా- తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభం అయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం తెల్లవారు జామున 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగడంతో ఈ విశేష పర్వదినం మొదలైంది.

నేడు రెండోరోజు. శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజైన బుధవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. వీటితో పాటు నేడు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications