టీటీడీ పీఆర్వో పేరుతో మహ్మద్ జావెద్ ఘరానా మోసం: ప్రత్యేకంగా గ్రూప్- డీపీగా బీఆర్ నాయుడి ఫొటో
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 65,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,307 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.29 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లల్లో వేచివుండట్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీని సొమ్ము చేసుకుంటోన్న ఓ ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చలామణి అవుతోన్న ఓ కేటుగాడిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడి ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శనం టికెట్లను ఇస్తానంటూ ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం టీటీడీ అధికారుల దృష్టికి వచ్చింది. గోపాల్ రాజు ఎన్ఆర్ఐ భక్తుడు బీఆర్ నాయుడికి ఫిర్యాదు చేయడంలో అతని వ్యవహారం బట్టబయలైంది.
చైర్మన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల 2 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా నకిలీ వెబ్ సైట్లను, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే దర్శనం, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.












Click it and Unblock the Notifications