శ్రీవారి దర్శనం కోసం స్థానికుల కోటా టికెట్ల విడుదల తేదీ ఇదే..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 77,260 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.12 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన టికెట్ల జారీ తేదీలను కూడా టీటీడీ ఇదివరకే విడుదల చేసింది.
వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు గురువారం ఆన్‌లైన్‌లో అందుబాటులో వచ్చాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను టికెట్లు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆదివారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
ఇక తాజాగా తిరుపతి స్థానికుల కోటాను విడుదల చేయడానికి టీటీడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. జనవరి 5వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నారు. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా టికెట్లను జారీ చేయాలని బీఆర్ నాయుడి సారథ్యంలో టీటీడీకి కొత్త పాలక మండలి ఏర్పాటైనప్పుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీనికి అనుగుణంగా ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను అదే నెల 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తారు.
మొత్తం అయిదు మండలాలు- తిరుమల, తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు ఈ టికెట్లను పొందవచ్చు. టికెట్లను తీసుకునే సమయంలో వాళ్లు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు ఒరిజినల్‌ను చూపించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications