కేబినెట్ ప్రక్షాళన వేళ ట్విస్టులు-మాజీలకు సజ్జల బుజ్జగింపులు-అసంతృప్తి తొలగేనా ?
ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళన వేళ ట్విస్టులు చోటు చేసుకుంటుున్నాయి. ముఖ్యంగా కేబినెట్ లో నుంచి తప్పుకున్న మంత్రుల్లో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న ఊహాగానాల మధ్య ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారిలో కొందరితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా జగన్ కేబినెట్ సమావేశంలోనే నిన్న వారికి ఇచ్చిన హామీల్ని గుర్తుచేయడంతో పాటు భవిష్యత్తులో ఏలోటూ రాకుండా చూసుకుంటామన్న హామీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రక్షాళనపై సీనియర్ల అసంతృప్తి
ఏపీలో కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా మంత్రులందరితోనూ సీఎం జగన్ నిన్న రాజీనామాలు చేయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మంత్రులందరితోనూ రాజీనామాలు చేయించారు. వీరిలో కొందరికి మాత్రం కొనసాగింపు ఉంటుందని చెప్తున్నా.. వారితో ఎందుకు రాజీనామాలు చేయించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తమకు కొనసాగింపు ఇవ్వాలని వివిధ మార్గాల్లో జగన్ వద్ద లాబీయింగ్ చేయించేందుకు ప్రయత్నించి విఫలమైన మంత్రులు.. ఇప్పుడు రాజీనామాలు చేయాల్సి రావడంపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిని బుజ్జగించకుండా కొత్త జాబితా ప్రకటిస్తే అసంతృప్తుల సంఖ్య మరింత పెరుగుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.

సీనియర్లకు సజ్జల బుజ్జగింపులు
జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉంటూ నిన్న రాజీనామా సమర్పించిన సీనియర్లు తమకు సంతోషంగానే ఉందని పైకి చెప్పుకుంటున్నా లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిని బుజ్జగించే బాధ్యతను సీఎం జగన్ .. తనకు నమ్మిన బంటు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. నిన్న కేబినెట్ భేటీ ముగిశాక రాజీనామాలు తీసుకుంటూ స్వయంగా బుజ్జగించిన జగన్ .. ఆ తర్వాత వారి అసంతృప్తిని గమనించి మరోసారి సజ్జలతో వారిని భేటీ కావాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ నలుగురు మాజీ మంత్రులు సజ్జలతో భేటీ అయ్యారు.
వీరిలో మోస్ట్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు సీఎం సొంత జిల్లాకు చెందిన అంజాద్ బాషా, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

రాజకీయ భవిష్యత్తుకు హామీ ?
తాజాగా మాజీలైన మంత్రుల్ని వారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటానని సీఎం జగన్ నిన్న హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రాంతీయ, జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్లుగా నియమిస్తానని, కేబినెట్ హోదా కూడా కల్పిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. అయినా వారు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులకు మరిన్ని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు ఇవ్వడం ద్వారా మంత్రి పదవి లేని లోటు భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల విషయంలోనూ వీరికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో వీరు సంతృప్తి చెందుతారా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications