సిడబ్ల్యుసి నిర్ణయం శిరోధార్యమే, కానీ..: విభజనపై బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు), కేంద్ర హోం శాఖకు రెండు ప్రాంతాల నాయకులు సమర్పించిన నివేదికలను పంపించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. సీమాంధ్ర నాయకులతో తానూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చించామని, వారు సమైక్య రాష్ట్రం కావాలన్నారని, తెలంగాణ నేతలతో తానూ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చర్చించామని, వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడాలని కోరారని ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన అంశం సున్నితమైందని, ఇరు ప్రాంతాల నాయకులు సమర్పించిన రెండు నివేదికలను తాము పంపించామని ఆయన చెప్పారు. రెండు నివేదికలతో పాటు ఎవరెవరు ఏం మాట్లాడారనేది చేర్చి ఆ నివేదికలను తాము పంపించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నేతలు వంద పేజీల నివేదిక ఇచ్చారని, దాన్ని జివోఎంకు కూడా పంపిచారని ఆయన చెప్పారు.

ఇరు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తమ పార్టీ ఇరు ప్రాంతాల నాయకులు వ్యవహరిస్తున్నారని, మొదటి నుంచీ తాము ఇదే మాటపై ఉన్నామని, ఈ విషయంలో ఏకతాటిపై ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం శీరోధార్యమే కానీ ఇరు ప్రాంతాల్లోని ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనపై తాము రంగులు మార్చడం లేదని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి రెండు నివేదికలు పంపించామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ అంశం తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ముక్తసరిగా మాట్లాడారు. ప్రశ్నలను ఎక్కువగా ఆహ్వానించకుండా లేచి వెళ్లిపోయారు. మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ గతంలో కన్నా ఈ రకంగా భిన్నంగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications