బాబుపై ఉండవల్లి సంచలనం, హైకోర్టుపై బుట్టా రేణుక
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుంది కనుకే ఒక్క శాతం ఓట్లతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం అన్నారు. రాజధాని పరిసర ప్రాంత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడ కూడా వివాదాస్పదం కాలేదని చెప్పారు. రాజధానికి భములు ఇవ్వని రైతులతో ప్రభుత్వం మాట్లాడి, వారి భయాందోళనలు తొలగించాలని హితవు పలికారు. రాజధాని పరిసర గ్రామాల్లోని భూములు అన్నీ 365 రోజులు పంటలు పండే భూములన్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. అప్పుడు ప్రతిపక్షలో ఉన్న బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని అయినా ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. బీజేపీ వ్యూహాత్మకంగా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఉండవల్లి పలు ఆరోపణలు చేశారు.
ప్రజల మద్దతు లేకుండా ల్యాండ్ పూలింగ్ చేయడం సరికాదన్నారు. భూసమీకరణ పేరుతో రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. స్వచ్చందంగా భూములు ఇచ్చిన చోటే రాజధానిని నిర్మించాలన్నారు. ఆర్థికపరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మించాలన్నారు. వాస్తు పేరుతో రైతులకు ఇబ్బంది పెడితే ఊరుకోమని, ప్రభుత్వం మొండికేస్తే కోర్టులో చుక్కెదురు తప్పదని ఉండవల్లి హెచ్చరించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: ఎంపీ రేణుకా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకా కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి చేశారు. మంత్రి గౌడను కలిసిన ఎంపీ ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. భవిష్యత్తులో మరో రాయలసీమ ఉద్యమం రాకుండా ఉండాలంటే కర్నూల్‌లో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బులు: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో త్వరలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications