పవన్ కు ఉండవల్లి కీలక లేఖ-పార్లమెంట్, సుప్రీంలో సాయం కోరుతూ..!
2014లో జరిగిన ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పదేళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉంది. దీనిపై గతంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలకు పలుమార్లు ఏపీ తరఫున అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరినా ఫలితం లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ కు మద్దతుగా చివర్లో అఫిడవిట్ ఇచ్చింది.
అయితే అప్పట్లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ లో జరిగిన పరిణామాల్ని తప్పుబడుతూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా పలుమార్లు అదే పార్లమెంట్ లో స్పందించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసి పెప్పర్ స్ప్రేలు వాడి విభజన చేసిన తీరును వీరు తప్పుబట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై తన పిటిషన్ కు స్పందించాలని కోరుతూ ఉండవల్లి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.

ఇందులో రాష్ట్ర విభజన జరిగిన తీరు, పార్లమెంట్ లో అప్పటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో చంద్రబాబు, జగన్ స్పందించిన తీరు..ఇలా పలు అంశాల్ని ఉండవల్లి ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్న అంశాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చ జరిగేలా పవన్ ఎంపీలతో నోటీసులు ఇప్పించాలని, అలాగే సుప్రీంకోర్టులో ప్రభుత్వాల నుంచి అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications