ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!!
లోక్‌సభ నియోజకవర్గాల పెంపు కు రంగం సిద్దం అయింది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ - అసెంబ్లీ సీట్లు 50 శాత మేర పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో.. ఏపీలో పెరిగే లోక్‌సభ సీట్ల పైన స్పష్టత వచ్చింది. ఇక.. గతంలో ఉన్నవి కొన్ని పునరుద్దరణతో పాటుగా ప్రస్తుతం ఉన్న వాటిల్లో మరి కొన్ని రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల ముఖచిత్రం మారనుంది. పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల్లో మార్పులు చేర్పుల పైన చర్చ మొదలైంది. 2011 జనాభా ప్రతిపాదకన పునర్విభజనకు నిర్ణయించారు. కేంద్రం తాజా నిర్ణయంతో ఏపీలో ప్రస్తుతం ఉన్నలోక్‌సభ నియోజకవర్గాలు మరో 13 వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వే షన్ల అమలు నేపథ్యంలో ఏపీ నుంచి మహిళలకు 12-13 స్థానాలు వరకు దక్కే అవకాశం ఉంది.

కాగా.. ఏపీలోని ప్రస్తుత ఉమ్మడి జిల్లాల జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తో పాటుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, క్రిష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో లోక్‌సభ స్థానాలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో లోక్‌సభ నియోజకవర్గంగా ఉండి.. 2009లో రద్దయిన తెనాలి లోక్‌సభ స్థానం పునరుద్దరణ కావటం ఖాయంగా కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. ఇందులో మహిళల సంఖ్య 2.47 కోట్లు.
మారనున్న రిజర్వేషన్లు... మారుతున్న లెక్కలు
అయితే, ఏపీ నుంచి లోక్‌సభ కు ప్రస్తుతం ముగ్గురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త రిజర్వేషన్లు అమలు అయితే వీరి సంఖ్య మరో పది పెరగనుంది. ఏపీలో ఎస్సీ జనాభా 84.69 లక్ష లు కాగా ప్రస్తుతం 4 లోక్‌సభ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ గా ఉన్నాయి. గుంటూరు, ఉభయ గోదావరి, క్రిష్ణా జిల్లాల పరిధిలో ఎస్సీ నియోజకవర్గాలు పెనగనున్నాయి. ఎస్సీ మహిళలు ఈ జిల్లాల్లోనే ఎక్కువ గా ఉన్నారు. ఈ జిల్లాల్లోనే మహిళలకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఎస్టీ జనాభా 27.40 లక్షలు. ప్రస్తుతం అరకు లోక్‌సభ ఎస్టీలకు కేటాయించారు. ఎస్టీలు ఎక్కువగా విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఉన్నారు. ఎస్టీ మహిళల జనాభా ఎక్కువగా విశాఖలో ఉన్నారు. దీంతో.. ఎస్టీ రిజర్వ్డ్ నియోజక వర్గాల్లోనూ మహిళలకు రెండు దక్కే ఛాన్స ఉంది. కాగా.. ప్రస్తుతం అనంతపురం, కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో రెండు ప్రముఖ నియోజకవర్గాలు రద్దయి.. ఆ స్థానంలో కొత్త పేరుతో లోక్‌సభ సీట్లు కొత్త పేరుతో వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నియమించే డీ లిమిటేషన్ కమిటీ కసరత్తు.. నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications