పోలవరానికి వైఎస్ జగన్: గజేంద్రసింగ్‌తో కలిసి సందర్శన: విజయవాడలో కేంద్రమంత్రి
అమరావతి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిశీలించనుంది. సవరించిన అంచనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న విజ్ఞప్తులపై తుది నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే- రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి.

విజయవాడకు చేరుకున్న షెకావత్
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించడానికి జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఇప్పటికే విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనను భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్.. సహా పలువురు సీనియర్ నాయకులు షెకావత్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

వైఎస్ జగన్‌తో భేటీ..
అనంతరం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఇవ్వాళ వారిద్దరూ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్తారు. 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు- 1 పునరావాస కాలనీకి చేరుకుంటారు. కేంద్రమంత్రితో కలిసి అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు.

పనుల పురోగతిపై..
అనంతరం 11:20 నిమిషాలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని, అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడినుంచి 12:30 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. నిర్మాణ పనులను పరిశీలిస్తారు. నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిపై మేఘా ఇంజినీరింగ్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను తిలకిస్తారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

సాయంత్రం వరకూ అక్కడే..
సాయంత్రం 4:30 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో స్పిల్‌వే, ఫిష్ ల్యాడర్, కాఫర్‌డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్ ప్రాంతాలను పరిశీలించారు.

ఢిల్లీపై ఒత్తిడి..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలుమార్లు ఆయన ఈ ప్రాజెక్ట్‌పై సమీక్షా సమావేశాలను నిర్వహించారు. మూడుసార్లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీసారీ ఈ ప్రాజెక్ట్ నిధుల గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వద్ద నిధుల గురించి చర్చించారు. అటు రాజ్యసభ, లోక్‌సభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

సవరించిన అంచనాలపై..
అన్నిరకాలుగా నిధుల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రాగలిగారు. 2017-18లో కేంద్ర జలసంఘం 55,548.87 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను రూపొందించింది. దీన్ని ఆమోదించాలనేది వైఎస్ జగన్ విజ్ఞప్తి. మరోసారి ఇదే అంశాన్ని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని రానున్నారు. తన సందర్శన తరువాత గజేంద్రసింగ్ షెఖావత్- సవరించిన అంచనాలపై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications