స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు భారీ పరిహారం, ప్యాకేజీ..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన పై కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రి కుమార స్వామి ఘటనా స్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటన జరిగిన తీరు, భద్రత చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆదేశించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కుమార స్వామి వివరించారు. ఈ ఘటనతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్న మంత్రి, ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి, వారు రెగ్యులర్ ఉద్యోగులైనా లేదా ఔట్‌సోర్సింగ్ సిబ్బందైనా, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది వారికి లభించే బీమా, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే కొనసాగేందుకు అనుమతి ఇస్తామని, కార్మికుల పిల్లలకు పూర్తి ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు.

కార్మికులకు అండగా నిలుస్తాం
ఈ నిర్ణయం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. కుటుంబాల భవిష్యత్ భద్రత కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందు కు ఇతర ఉక్కు కర్మాగారాల నిపుణులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని నియమించినట్లు కుమారస్వామి వెల్లడించారు. కమిటీ సభ్యులు మంగళవారం విశాఖకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక సమర్పిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications