శ్రీవారి రథోత్సవంలో భక్తుల జాతర..!!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు రథంపై ఊరేగారు. ఆలయం నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అశేష భక్తజనావళిని కటాక్షించారు. ఈ ఉత్సవంలో వేలాదిమంది పాల్గొని, గోవిందుడి నామాన్ని స్మరిస్తూ భక్తిప్రపత్తులతో స్వామివారి రథాన్ని లాగారు.
గురువారం నాటితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చివరి రోజున చక్రస్నానాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అర్చకులు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో శ్రీవారి చక్రత్తాళ్వార్ కు పవిత్ర స్నానాన్ని ఆచరింపజేయడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సందర్శంచారు. జేఈవో వీ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణతో కలిసి బుధవారం పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను తనిఖీ చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నలువైపులా తిరిగి అక్కడి ఏర్పాట్లను స్వయంగా టీటీడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈవో మాట్లాడారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించడానికి, తిరిగి వెలుపలికి రావడానికి వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేశారని వివరించారు. గురువారం తెల్లవారు జామున 6 గంటల నుండి ఉదయం 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు.
చక్రస్నానం నాడు రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని, భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి తమకు సహకరించాలని కోరారు. నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులు దశలవారీగా పుష్కరిణిలోకి ప్రవేశించేలని కోరారు.
చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1,300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకం తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications