మార్స్ మిషన్: ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
శ్రీహరికోట: ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలబెట్టే మార్స్ మిషన్ కార్యక్రమానికి కూడా సమైక్య సెగ తప్పలేదు. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన్ కేంద్రం మీడియా సెంటర్‌లో గుమిగూడిన శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధుల మధ్య సమైక్య నినాదాలు వినిపించాయి. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతమైందని ప్రకటించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె రాధాకృష్ణన్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి రాధాకృష్ణన్ ఆడిటోరియంలోకి ప్రవేశించగానే సమైక్యాంధ్ర కార్యకర్తలు దూసుకొచ్చి సమైక్య నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సమైక్యాంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఓ ఆందోళనకారుడు ఓ శాస్త్రవేత్తకు పోస్టర్‌ను అందించబోయాడు. ఆ శాస్త్రవేత్త మర్యాదగా దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత రాధాకృష్ణన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సమైక్య నినాదాలతో రాధాకృష్ణన్‌తో పాటు మిగతా వారు ఆశ్చర్యపోయారు.

పిఎస్ఎల్వీ సి25 ప్రయోగం విజయవంతమైంది. మార్స్ ఆర్పిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న పిఎస్ఎల్వీ సి25 మంగళవారం మధ్యాహ్నం గం.2.38 నిమిషాలకు నింగికెగిసింది. కీలకమైన నాలుగు దశలు పూర్తి కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు తెలిపారు.
సమష్టి కృషితో విజయం సాధించామన్నారు. మామ్ 24 సెప్టెంబర్ 2014న కక్షలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగాన్ని కేంద్రమంత్రి నారాయణ స్వామి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ ప్రత్యక్షంగా వీక్షించారు. మామ్ సుమారు 35 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.












Click it and Unblock the Notifications