రోడ్డుపై కుప్పలు తెప్పలుగా వెయ్యి నోట్లు : దక్కించుకోవడానికి ఎగబడ్డ జనం
ద్వారకా తిరుమల: ఎక్కువ డినామినేషన్ నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. ఓవైపు సామాన్యులను బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరేలా చేస్తుంటే.. అక్రమంగా డబ్బు కూడబెట్టుకున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. కేంద్రం నిర్ణయంతో భారీ డబ్బును ఏంచేయాలో తోచని స్థితిలో.. చెత్త కుప్పల్లోను, రోడ్ల మీద వాటిని వెదజల్లుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో.. ఓ కారులోంచి వెయ్యి రూపాయల నోట్లను బయటికి విసిరేశారు. కుప్పలు తెప్పలుగా నోట్లన్ని రోడ్డు మీద పరుచుకోవడంతో.. స్థానికులంతా ఆ నోట్లను తీసుకోవడానికి ఎగబడ్డారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం కావడంతో.. చాలామంది ఆ నోట్ల కోసం రోడ్డు మీద పరుగులు పెట్టారు. ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపం వద్ద భీమడోలు వైపు వెళ్తున్న ఓ కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్ష పైచిలుకు విలువ చేసే వెయ్యి నోట్లను రోడ్డుపై ఆగకుండా వెదజల్లుకుంటూ పోయాడు.

అయితే... ఆ నోట్లను దక్కించుకున్న కొంతమంది ఇంతకీ అవి నిజమైన నోట్లేనా? అన్న అనుమానంలో ఉండిపోయారు. ఆ తర్వాత పెట్రోలు బంకుల్లో వాటిని తీసుకోవడంతో.. అవి నిజమైనవేనని ధ్రువీకరించుకున్నారు.












Click it and Unblock the Notifications