విశాఖపట్నం డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ పై లేటెస్ట్ అప్డేట్!
విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో రైలు కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పు జరగనుంది. కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందించే రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ, మొత్తం 20 కిలోమీటర్లుగా ఉన్న ప్రతిపాదనను 13 కిలోమీటర్లకు తగ్గించి అమలు చేయాలని సిఫార్సు చేసింది.
విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ పై రైట్స్ కేంద్రానికి ప్రతిపాదన
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మొదట 20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ప్రతిపాదించింది. ఇందులో స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్లు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే రైట్స్ సంస్థ సర్వేలు, అధ్యయనాలు చేసి గాజువాక నుంచి హనుమంతవాక వరకు 13 కిలోమీటర్లు మాత్రమే నిర్మిస్తే చాలని కేంద్రానికి తెలిపింది.

డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ ప్రతిపాదనల మార్పుకు కారణమిదే
ఈ తగ్గింపు వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గుతుందని, భూసేకరణ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నగరం మధ్యలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనుండటంతో, మెట్రో కారిడార్‌ను, దానికి అనుగుణంగా డిజైన్ చేయడం ద్వారా ఖర్చు మరింత తగ్గించవచ్చని భావిస్తున్నారు. విశాఖపట్నంలో మొత్తం 140.13 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్రం లక్ష్యం వేసుకుంది.
మొదటిదశలో రూ.11,498 కోట్లతో ప్రాజెక్టు
మొదటి దశలో 46.23 కిలోమీటర్ల పొడవున రూ.11,498 కోట్లతో ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదించారు. డబుల్ డెక్కర్ కారిడార్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచి స్థానికులు మెట్రో సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారు. డబుల్ డెక్కర్ మెట్రో వస్తే ట్రాఫిక్ ఒత్తిడి బాగా తగ్గి, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైట్స్ సంస్థ సిఫార్సు ఆమోదం పొందితే ప్రాజెక్ట్ రయ్ రయ్
రైట్స్ సంస్థ సిఫార్సు ఆమోదం పొందితే, ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. భూసేకరణ తక్కువ కావడం వల్ల స్థానికుల్లో వ్యతిరేకత కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశాఖపట్నం అభివృద్ధికి ఈ మెట్రో ప్రాజెక్టు చాలా కీలకం. ఇది నగర రవాణా వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు, ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుంది. తుది అనుమతులు వచ్చిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications