జనసేనలోకి వంగవీటి రాధా- బిగ్ ఆఫర్, కీలక మలుపు..!?
స్థానిక ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల కు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతోంది. మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ క్రమంలో కూటమిలో సీట్లు దాదాపు ఖరారయ్యాయి. విజయవాడ సీటు జనసేనకు ఖాయమని చెబుతున్న వేళ అనూహ్య నిర్ణయాలు జరుగుతున్నాయి. వంగవీటి రాధా టీడీపీ నుంచి జనసేన లోకి చేరటం ఖాయమని సమాచారం. ముహూర్తం ఖరారైంది. మేయర్ గా పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు విజయవాడలో ఉత్కంఠ పెంచుతున్నాయి.
విజయవాడ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది. కూటమి సీట్ల లెక్కల్లో భాగంగా విజయవాడ మేయర్ స్థానం జనసేనకు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు జనసేన పూర్తి ఏర్పాట్లు చేసుకుంటోంది. కాగా.. రిజర్వేషన్లలో విజయవాడ జనరల్ కావటంతో... జనసేన నుంచి ఎవరిని బరిలోకి దించుతారనే చర్చ జరిగింది. ఒక దశలో వంగవీటి రాధా సతీమణి జనసేన నుంచి పోటీ చేస్తారనే వాదన వినిపించింది. అయితే, ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ మేయర్ గా జనసేన నుంచి రాధా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ అమలు కాలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా.. బరిలోకి దిగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన లోకి రాధా వెళ్తారనే ప్రచారం సాగింది. పవన్, నాదెండ్ల మనోహర్ తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక, మున్సిపల్ ఎన్నికల వేళ.. విజయవాడ నుంచి రాధాకు సీటు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు పార్టీలో చర్చ జరిగింది.
అందులో భాగంగా జనసేనలో చేరి పార్టీ నుంచి పోటీ చేయాలనే సూచన మేరకు.. టీడీపీ నాయకత్వంతోనూ మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధా అధికారికంగా రేపు ( బుధవారం) వపన్ సమక్షంలో జనసేనలో చేరేందుకు రంగం సిద్దమైంది. కూటమి నుంచి సీట్ల పైన అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత.. రాధా పోటీ పైన పార్టీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. రాధా జనసేనలో చేరిక వ్యవహారంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications
