స్వాగతం, పవన్‌పై నిర్ణయం తీసుకుంటాం: వెంకయ్య
న్యూఢిల్లీ: తన జనసేన పార్టీని స్థాపిస్తూ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం పట్ల బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు సానుకూలంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కళ్యాన్ పార్టీ విధివిధానాలను, భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచనను చూసిన తర్వాత జనసేన పార్టీ పట్ల ఏ విధమైన వైఖరి తీసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
పవన్ కళ్యాణ్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు ఆలోచన తెలియాలని, అప్పుడే ఆ పార్టీతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు సంబంధించి తమ పార్టీ వ్యూహం ఇంకా ఖరారు కాలేదని, వ్యూహం ఖరారైన తర్వాతనే పొత్తులపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు

పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో నిజం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అనే నినాదం అందరినీ ప్రభావితం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గుణపాఠం చెప్పాలనే పవన్ కళ్యాణ్ మాటలకు తాను సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించిందని ఆయన చెప్పారు. తనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై ఆయన ఈ విషయం చెప్పారు.
వ్యక్తిగతంగా తాను ఎవరి గురించి కూడా మాట్లాబోనని, ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడబోనని, పనవ్ కళ్యాణ్‌పై తాను ఆ విధంగా అనలేదని ఆయన వివరించారు. అయినా అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లో బిజెపి శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications