సోనియాని ప్రభావితం చేసి... అన్నింటికి నేనా!: వెంకయ్య
హైదరాబాద్: పోలవరం అంశానికి సంబంధించి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడే ఇదంతా చేశారని ఆరోపణల పైన ఆయన స్పందించారు. మన్మోహన్ సింగ్ మనసులోకి వెళ్లి వెంకయ్య రాజ్యసభలో ప్రకటన చేయించాడా? సోనియా గాంధీని ప్రభావితం చేసి ఆమెతో ప్రధానికి లేఖ రాయించాడా? అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెసు హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కాలువల పని పూర్తయిందని చెప్పారు. దానికి వెంకయ్య నాయుడు కారణమా అన్నారు. ఇటువంటి అసంబద్ద ప్రకటనల పైన స్పందించవలసిన అవసరం లేదన్నారు. పునరావాస చర్యలపై స్పందిస్తూ.. రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. గిరిజనులు, గిరిజనేతరులకు సాధారణం కన్నా మెరుగైన పునరావాసం కల్పిస్తామన్నారు.

బిల్లుపై అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లమని స్పీకర్ చెప్పలేదన్నారు. చట్టబద్దత ప్రస్తావన వచ్చినప్పుడు... చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుకు ఉందని, వాటి చెల్లుబాటు కోర్టు పరిధిలో ఉంటుందని మాత్రమే స్పీకర్ చెప్పారన్నారు.
కాంగ్రెసు పార్టీ రెండు నాల్కల ధోరణి విచారకరమన్నారు. కాంగ్రెసు చేస్తే సక్రమం.. తాము చేస్తే అక్రమమా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని అడ్డంకులు తొలగిస్తామని హామీ ఇచ్చి, ఆర్డినెన్స్ తెచ్చి, ఇప్పుడు తాము రాజ్యాంగబద్దంగా ఆమోదం చేస్తే మందబలమా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications