షర్మిల యాత్రను అడ్డుకుంటాం, రేవంత్ దొరికిన దొంగ: విహెచ్
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎందుకోసం యాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పర్యటించడం వల్ల షర్మిలకు లాభమేంటని నిలదీశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ శత్రువన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) షర్మిల యాత్రను ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. షర్మిల యాత్రను తామే అడ్డుకుంటామని వీహెచ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో దొరకనివారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. అవినీతి వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను కలువనున్నట్లు వీహెచ్ తెలిపారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక సమాజాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విజయవాడ నవ నిర్మాణ దీక్షలో ప్రకటించారని గుర్తు చేస్తూ అవినీతిని ఎలా నిర్మూలిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇతర పార్టీల శాసనసభ్యులు టిఆర్ఎస్‌లోకి ఫిరాయించారని, అది కూడా తేలాల్సి ఉందని ఆయన అన్నారు.

పోచారం కుంభకోణంలో కూరుకుపోయారు..
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుంభకోణంలో కూరుకుపోయారని కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పోచారం తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు
రాష్ట్రంలో మాఫీ చేయాల్సిన రుణాలను టిఆర్ఎస్ ప్రభుత్వం కుదించిందని ఆయన అన్నారు రైతులకు రూ.6 వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని ఆయన చెప్పారు. రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాకపోతే రైతులపై కొత్త రుణాల వడ్డీ భారం పడుతుందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆ రుణాలను ప్రభుత్వ రుణాలుగా మార్చాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications