ఏపీకి అన్యాయం చేసిన కుట్రలో చంద్రబాబు ప్రధాన సూత్రధారి: విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును, టిడిపి నాయకులను, ఇదే సమయంలో వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విభజనపై చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన ద్వారా అన్యాయం చేశారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీకి అన్యాయం చేసిన కుట్రలో చంద్రబాబు సూత్రధారి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.
చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలి
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ప్రధాని మోదీ స్వయంగా దుయ్యబట్టారు. విభజన జరగాల్సిందేనని ప్రధానికి అనేకసార్లు లేఖలు రాసి, ఒత్తిడి చేసిన చంద్రబాబు ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు . ఏ మాత్రం సిగ్గున్నా చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

వయసు మీద పడింది. ఇక రెస్ట్ తీసుకోండి
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై అసమ్మతి రాజేయటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఆరిపోయిన నిప్పును రాజేయడానికి పచ్చ పేపర్లతో ఎంతగా గాలి కొట్టినా లాభం లేదు బాబూ అంటూ ఎద్దేవా చేశారు. జనం మీవెంట ఉంటే కదా అగ్గి రాజుకునేది. అనుకుల మీడియా ఉంటే చాలన్న భ్రాంతిలోకి ఎప్పుడు జారిపోయారో అప్పుడే మీ పతనం మొదలైంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆరిన జ్వాల ఎప్పటికీ ఎగసిపడదు. వయసు మీద పడింది. ఇక రెస్ట్ తీసుకోండి అని విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సలహా ఇచ్చారు.

మీ నిజనిర్ధారణ కమిటీ ఏం తేల్చిందో చెప్పండి బాబూ
ఇక ఇదే సమయంలో విషం కలిపిన జీలుగుకల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో వైసిపి నేతలను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన లో మీ పార్టీ నేత వంతల రాంబాబే దోషి అని తేలింది. పోలీసులు దగ్గర అతను నిజం కక్కేశాడు. అతను స్వయానా మీ పార్టీ ఇన్చార్జి వంతల రాజేశ్వరికి బంధువు. మీ నిజనిర్ధారణ కమిటీ ఏం తేల్చిందో చెప్పండి బాబూ అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

పోలీసులను బట్టలు విప్పి కొడతారా అయ్యన్నా?
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేసి విమర్శించిన విజయసాయిరెడ్డి పోలీసులను బట్టలు విప్పి కొడతారా అయ్యన్నా? గతంలో ఒక మహిళా అధికారిపై ఇలాగే నోరు పారేసుకున్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా, అక్రమ సంపాదన అంతా వెదజల్లినా మళ్ళీ గెలవడం కల్ల అని తేల్చి చెప్పేశారు. అప్పుడు ఎవరు బట్టలు చింపుకుని వీధుల వెంట తిరుగుతారో తెలుస్తుంది. ఓపిక పట్టండి అని పేర్కొన్నారు.

జనం ఓడించాక ఢిల్లీలో శాశ్వతంగా రచ్చబండలు పెట్టుకోవచ్చు
వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని బీరాలు పలికారు...సొంతంగానే గెలుస్తానంటూలగడపాటి మార్క్ సర్వేలు చేయించారు. కానీ సొంత నియోజకవర్గానికి వెళ్తే జనం తిరగబడతారని ఇప్పుడు సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జనం ఓడించాక ఢిల్లీలో శాశ్వతంగా రచ్చబండలు పెట్టుకోవచ్చు. రాళ్లు - రప్పలతో మాట్లాడుకోవచ్చు అంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications