Delimitation: రాజ్యసభలోనూ డీలిమిటేషన్ ? సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందితే లోక్ సభలో సీట్ల సంఖ్య 543 నుంచి 850కు పెరుగుతుంది. అయితే రాజ్యసభ సీట్లు మాత్రం యథాతథంగా 250గానే ఉండబోతున్నాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ఓ కీలక డిమాండ్ చేశారు.
ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉండగా, రాజ్యసభలో 250 సీట్లు ఉన్నాయని, ఉమ్మడి సమావేశాలు మరియు కమిటీ సభ్యత్వంలో, ప్రతి రాజ్యసభ సభ్యునికి ఇద్దరు లోక్‌సభ సభ్యులు ఉంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచితే, ఈ నిష్పత్తి లోక్‌సభకు అనుకూలంగా 3:1 కంటే ఎక్కువగా దిగజారుతుందన్నారు. అంటే ఉమ్మడి సమావేశాల ద్వారా చట్టాలను బలవంతంగా ఆమోదింపజేసుకోవచ్చని తెలిపారు.

అదే సమయంలో రాజ్యసభలో ప్రతిధ్వనించే రాష్ట్రాల వాణి మరింతగా క్షీణిస్తుందన్నారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పందించి లోక్ సభలో పెరుగుతున్న సీట్లకు అనుగుణంగా రాజ్యసభలోనూ 50 శాతం సీట్లు పెంచాలని విజయసాయిరెడ్డి వారిని కోరారు. అప్పుడే రాజ్యసభకూ న్యాయం జరుగుతుందన్నారు. కానీ రాజ్యసభ సీట్ల పెంపు విషయంలో కేంద్రం వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనా లేదని తెలుస్తోంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగానే పనిచేసిన సాయిరెడ్డి మాత్రం భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications