చంద్రబాబు 15 వేల ప్రకటనపై ఆటో యూనియన్ల రియాక్షన్ ఇదే ..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం గత నెలలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటామని అప్పట్లోనే ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నిరసనలకు దిగుతున్న ఆటో డ్రైవర్లను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు .. వారికి దసరా సందర్భంగా 15 వేల చొప్పున సాయం చేస్తామని నిన్న అనంతపురంలో కీలక ప్రకటన చేశారు.
దీనిపై ఇవాళ విజయవాడలో ఆటో యూనియన్లు స్పందించాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశమైన ఆటో మోటారు కార్మిక సంఘాల ఐక్య వేదిక చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వాహన మిత్రను పెంచకుండా ప్రకటించి, ఎన్నికల హామీలను వదిలేసిన చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. పెనాల్టీల జీవో 21 రద్దు, సాధికారిత బోర్డు ఏర్పాటు, ఇంధన ధరలు తగ్గింపు వంటి ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు పోరాడుతామని వెల్లడించింది.

స్త్రీ శక్తీ ప్రీ బస్సు వలన 60 శాతానికి పైగా ఆదాయం కోల్పోయిన ఆటో, టాటా మ్యాజిక్ వంటి డ్రైవర్లకు వాహన మిత్ర సహాయం పెంచాలన్న ఆటో మోటారు కార్మిక సంఘాల అభ్యర్ధనను చంద్రబాబు పట్టించుకోలేదని నాయకులు తెలిపారు. పైగా ఐదు ప్రధాన హామీలలో ఒక దానిని ప్రకటిస్తూ మిగిలిన హామీలను విస్మరించడం చంద్రబాబు అతి తెలివికి నిదర్శనమని ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు ముజాఫర్ అహ్మద్ (సీఐటీయూ), దాది శ్రీనివాసరావు (ఐఎఫ్టీయూ), ఎమ్.ఈశ్వర్ (ఏఐసీసీటీయూ) ఎమ్ రామకృష్ణ (ఐఎఫ్టీయూ) పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అమలు ఇచ్చిన నవరత్నాల పేర్లు మార్చివేసి అమలు చేస్తున్న చంద్రబాబు.. వాహన మిత్ర పేరును మార్చకుండా అదే పేరుతో అమలు చేయడంలోనే మతలబు ఉందని భావిస్తున్నామన్నారు. వాహన మిత్రలో కేవలం ఓనర్ కమ్ డ్రైవర్ కు మాత్రమే పథకం అమలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా కేవలం ఆటో, క్యాబ్ ఓనర్ కం డ్రైవర్లకు మాత్రమే అందుతుందన్నారు. టిడిపి, జనసేనల ఎన్నికల హామీ ప్రకారం ఓనర్ షిప్ లేకపోయినా ప్రతి డ్రైవర్ కు పథకం అందిస్తామన్నారని గుర్తుచేశారు.
అలాగే ఆటో, క్యాబ్, లారీ వంటి అన్ని వాహనాల డ్రైవర్లకు ఏడాదికి 15000 రూపాయలు ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వాహన మిత్ర పేరు మార్చకుండా పాత దాని ప్రకారం అమలు చేస్తే రాష్ట్రంలోని 15 లక్షల డ్రైవర్లలో సుమారు మూడు లక్షల మంది ఆటో, క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే ఈ 15వేల రూపాయలు అందే పరిస్థితి ఉందన్నారు. 15వేల రూపాయలు పెంచక పోగా డ్రైవర్ల సంఖ్యను భారీగా కుదించే ప్రమాదం ఇందులో ఉందన్నారు.
ఆగస్టు 15న ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చించడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామన్నారని, ఇప్పుడు ఆ కమిటీ ఏమైందని ప్రశ్నించారు. ఎందుకు ఆటో మోటార్ కార్మిక సంఘాలతో చర్చించలేదని అడిగారు. ఎన్నికల హామీలలో వాహన మిత్రతో పాటు ప్రధానమైన జీవో నెంబర్ 21 రద్దు, ఆటో మోటార్ కార్మికులకు సాధికారిత బోర్డు, ఇంధన ధరల తగ్గింపు వంటి హామీలు గూర్చి అనంతపురం సభలో నామ మాత్రంగా అయినా ప్రస్తావించక పోవడంలోనే మోసం దాగి ఉందన్నారు.

కావున వాహనమిత్రను 15 వేల రూపాయల నుండి 30 వేల రూపాయలకు పెంచాలనీ, ఓనర్ షిప్ తో నిమిత్తం లేకుండా ఆటో, క్యాబ్, లారీ వంటి అన్ని వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 21 రద్దుతో చేయాలని, ఆటో మోటార్ కార్మికులకు సాధికారికతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను తగ్గించాలని అప్పటివరకు ఆటో మోటారు కార్మికుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 18వ తేదీన అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications