11 లక్షల క్యూసెక్స్ దాటిన ప్రకాశం బ్యారేజ్ అవుట్ ఫ్లో
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.
విలయతాండవం..
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

నేడూ వర్షాలు..
నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఫలితంగా- ఏపీకి జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు రానున్నాయి. బోట్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగబోతోన్నాయి. విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో వరద తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు.
బుడమేరుకు వరద..
బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
కొనసాగుతున్న తాకిడి..
శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఇన్ ఫ్లో 3,56,024 క్యూసెక్కులు. కాగా అవుట్ ఫ్లో 5,00,397 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,61,245 మేర ఉండగా.. అవుట్ ఫ్లో 4,53,700 క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3,39,434, ఔట్ ఫ్లో 3,14,434 క్యూసెక్కులు ఉంటోంది.
11 లక్షల క్యూసెక్కులు..
వాటి తీవ్రత ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్‌ఫ్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తోన్నామని వివరించింది. అవుట్ ఫ్లో కూడా 11,25,876 క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications