ఉండవల్లి మంతెన ఆశ్రమాన్ని చుట్టుముట్టిన వరద
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.
బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

వాటి తీవ్రత ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్‌ఫ్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తోన్నామని వివరించింది. అవుట్ ఫ్లో కూడా 11,39,351 క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొంది.
కాగా- ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉండే మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమంలోకి వరద నీళ్లు పోటెత్తాయి. అక్కడి వాహనాల పార్కింగ్ వద్ద మోకాలి లోతు నీళ్లు వచ్చాయి. కార్లు సగం వరకు మునిగిపోయి ఉండటం, ఆవరణ మొత్తం వరదనీరు ప్రవహించడం కనిపించింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ్రమంలో ఉంటోన్న వారిని తాళ్ల సహాయంతో బయటికి తీసుకొచ్చారు. ఎక్కువ మంది వృద్ధులు అక్కడ నివసిస్తోన్నారని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయిస్తోన్నారని చెబుతున్నారు.

వరదనీరు లోనికి ప్రవేశించకుండా ఉండటానికి జేసీబీల ద్వారా మళ్లింపు పనులు చేపట్టారని, ఇసుక మూటెలను అడ్డుగా పెట్టారని అంటున్నారు. ఈ ఘటనతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కోలాహలం నెలకొంది. అక్కడ నివసిస్తోన్న వారి బంధువులు, పలువురు స్థానికులు ఆశ్రమం వద్ద గుమికూడారు. వర్షాల వల్ల ఆశ్రమానికి దారి తీసే రోడ్డు మొత్తం ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications