వినుకొండ-గుంటూరు ఎన్హెచ్-544డీ విస్తరణలో మరో కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల విస్తరణపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ శరవేగంగా జరుగుతోంది.ఏపీలో రహదారుల విస్తరణ పూర్తి స్థాయిలో జరిగితే ఏపీలో ప్రగతికి బాటలు పడుతుందని నమ్ముతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించి పనులలో వేగం పెంచుతుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమరావతి అవుటర్ రింగ్ రోడ్ సుమారు 190-195 కి.మీ సిక్స్లేన్ పనులు ముందుకు సాగుతున్నాయి. ఎన్హెచ్ఏఐ దీని నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలిచి, నవంబర్ 18 వరకు బిడ్స్ స్వీకరిస్తోంది. ఇందులో మూడు టన్నెళ్లు, కృష్ణా నదిపై రెండు పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి. ఎన్హెచ్-516ఈ పనులు 60 శాతం పైగా పూర్తయ్యాయి. కడప-తమిళనాడు సరిహద్దు, పలమనేరు మార్గాల విస్తరణతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కూడా కేంద్ర స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్యమైన జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి ఎన్హెచ్-544డీలో భాగంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న 85.9 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రూ.3,476 కోట్లు అంచనా వేశారు.
ఈ రూట్ పల్నాడు (53.91 కి.మీ), ప్రకాశం (13.80 కి.మీ), గుంటూరు (18.19 కి.మీ) జిల్లాల మీదుగా వెళ్తుంది. మొత్తం 85.9 కిలోమీటర్లలో 41.28 కిలోమీటర్లు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తారు. మిగిలిన 44.62 కిలోమీటర్లు ప్రస్తుత రోడ్డును విస్తరించనున్నారు. వినుకొండ, శావల్యాపురం, సంతమాగులూరు, పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ, సాతలూరు, ఫిరంగిపురం వంటి ప్రాంతాల్లో ఆరు బైపాస్లు నిర్మించనున్నారు.
ఈ హైవేకి 45 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయనున్నారు. ఐదు చోట్ల రైల్వే లైన్ దాటే వసతి కూడా ఉంటుంది. డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వంలోని పీపీపీఏసీ ఆమోదం కోసం పంపించారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభిస్తే భూసేకరణ, నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ, పల్నాడు ప్రాంతాల నుంచి గుంటూరు, అమరావతి వైపు ప్రయాణం సులభతరం అవుతుంది. రవాణా సమయం తగ్గి, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటకం మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
