విశాఖ స్టీల్ ప్లాంట్ రగడ : ఫేక్ సీఎం జగన్; కేంద్రానికి ప్రేమలేఖలు ఆపి ఆ పని చెయ్ : లోకేష్, అచ్చెన్న ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రగడ మరోమారు తెరపైకి వచ్చింది. తాజాగా కేంద్రం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు టెండర్లను ఆహ్వానించడంతో ప్రస్తుతం ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తీరుపై, ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. టిడిపి నేతలు జగన్ సర్కార్ మౌనం వీడాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఎలాగైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ : లోకేష్
స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర అడుగులు వేయడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫేక్ సీఎం వైయస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో తేలిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు నారా లోకేష్.

విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు : నారా లోకేష్
ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నాలు చేయండి అంటూ లోకేష్ జగన్ కు హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయటానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర హీనులుగా నిలిచిపోతారు అంటూ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణకోసం, ఏపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం మీ ఎంపీలతో పోరాటం చేయించాలని కూడా కోరారు.మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేలా మీ ఎంపీలకు ఆదేశం ఇవ్వండి అంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.

జగన్ కేసుల కోసం ఆంధ్రా హక్కును తాకట్టు పెట్టారు : అచ్చెన్న
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ మౌనం వీడాలని అచ్చెన్నాయుడు సైతం డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని మండిపడ్డారు. జగన్ కేసుల కోసం ఆంధ్రా హక్కును తాకట్టు పెట్టారని విమర్శించారు. ఫోక్సో కంపెనీకి స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టి కమిషన్లు కొట్టేయాలని గతంలో ప్లాన్ చేశారని విమర్శించారు.కేసుల కోసం కేంద్రం వద్ద మోకరిల్లడం సీఎం జగన్ మానుకోవాలని హితవు పలికారు. కేంద్రానికి ప్రేమలేఖలు ఆపి ప్రజల కోసం పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం కోసం ప్రభుత్వం పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications