ఎవరయ్యా బాబూ.. ఈ ఉయ్యూరు శ్రీనివాసరావు?
ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లిన కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జన్మభూమికి సేవలందించేందుకు ముందుకు వస్తున్నాయి. తమ సంపాదన నుంచి కొంత నగదును సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాయి. అటువంటివారిలో ఒకరు.. ఉయ్యూరు శ్రీనివాసరావు. వర్జీనియాలో స్థిరపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు వీరాభిమాని. గుంటూరు జిల్లా వేజెండ్ల ఆయన స్వగ్రామం. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ntr fans usa in corporation అనే సంస్థ ద్వారా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు.

అమెరికాలో విద్యనభ్యసించేందుకు వడ్డీలేని రుణాలు
విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వ్యవసాయ భూములపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీనివల్ల ఎంతోమంది విదేశీ విద్యకు దూరమవుతున్నారు. కొవిడ్ సమయంలో అయితే ఈ తరహా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. అటువంటివారికి ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున సాయం చేయాలని శ్రీనివాసరావు నిర్ణయించారు. ఒక్కో విద్యార్థికి రెండు సంవత్సరాల చదువు పూర్తయ్యేందుకు 50వేల డాలర్లను రుణంగా ఇస్తారు. ఇది పూర్తిగా వడ్డీ రహితం. వీరంతా ఉద్యోగంలో చేరిన తర్వాత అసలును తిరిగిచ్చేయవచ్చు. 2022 మే 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి సంవత్సరం 30 మంది విద్యార్థులకు రుణాలిచ్చారు. తర్వాత ఏడాదిని దీని సంఖ్యను పెంచనున్నారు.

సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు
పేదలకు అన్నదానం చేయడం కోసం గుంటూరు నగరంలో 2, హిందూపురంలో 1 చొప్పున అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా రోజూ 500 మందికి ఆహారం అందిస్తున్నారు. అన్నంతోపాటు రోటి పచ్చడి, పప్పు, కూర, మిఠాయి, సాంబారు, పెరుగు వడ్డిస్తున్నారు. దసరా సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు నిర్వహించారు. సంక్రాంతి కానుక, అన్నగారి జనతా వస్త్రాలద్వారా పేదలకు చేయూతనివ్వాలని తలచారు. దీంతో సుమారు 18వేల మందికి ఈ కానుకలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

మొబైల్ అంబులెన్స్ ద్వారా వైద్యసేవలు
మొబైల్ అంబులెన్స్ ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైద్యసేవలందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైద్యుణ్ని ఏర్పాటు చేయడంతోపాటు ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని శ్రీనివాసరావు చెప్పారు. రోగికి అవసరమైన మందులను ఉచితంగానే అందించనున్నారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 35వేల మందికి అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వేసవిలో క్రీడా శిబిరాల ఏర్పాటుతోపాటు తెలుగు భాష అభివృద్ధికి గ్రంథాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications