కిరణ్ తప్పులు లెక్కిస్తున్నాం: యాష్కీ, బాబుపై ఎర్రబెల్లి
హైదరాబాద్/ఢిల్లీ: శిశుపాలుడిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పులను తాము లెక్కిస్తున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మంగళవారం అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల మేరకే జరుగుతోందని, ఆగే ప్రసక్తి లేదన్నారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందన్నారు. ఇతర పార్టీలు ఏవీ సహకరించకపోయినా బిల్లు పాస్ అవుతుందన్నారు. వచ్చే జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక తెరాస అధికారంలోకి రాదన్నారు.

బాబు ఒత్తిళ్లకు లొంగరు: ఎర్రబెల్లి
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల సమైక్యవాద ఒత్తిళ్లకు తలొగ్గరని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు.
గత తీర్మానమే ఇచ్చాం: శైలజానాథ్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గతంలో చేసిన తీర్మానం ప్రతినే తాము పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందించామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తాము చేసిన తీర్మానం ప్రతిని జివోఎంకు నివేదిస్తారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ఆలోచన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై అద్వానీ ఆరా
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై తమ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అడిగి తెలుసుకున్నారని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఢిల్లీలో అన్నారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు మంగళవారం రాజ్ నాథ్ సింగ్, అద్వానీలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అసందిగ్ధతకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. సిడబ్ల్యూసి తీర్మానం మేరకు కాంగ్రెసు బిల్లు ప్రవేశ పెడుతుందో లేదో చూడాలన్నారు.












Click it and Unblock the Notifications