మేం కాదు, అల్లుడే కూల్చుతారు: కేసీఆర్‌కు ఎర్రబెల్లి
హైదరాబాద్: ప్రతిపక్షాల గొంతు నొక్కి సభను కేవలం మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులతో నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం మండిపడ్డారు. అసెంబ్లీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపించిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు.
రైతు ఆత్మహత్యల పైన మంగళవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ అపాయింటుమెంట్ కూడా కోరామన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతామన్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపుల పైన సభాపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీలు మారడం వారి ఇష్టమే కానీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ ఏ భయంతో పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ప్రశ్నించారు. తాము ఐదేళ్ల వరకు ఈ ప్రభుత్వాని దించబోమని, కూలిస్తే ఆయన అల్లుడే కూల్చాలన్నారు.

విఫలం: డాక్టర్ కే లక్ష్మణ్
తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వ్యక్తిగత విమర్శలతో కాలం వెల్లబుచ్చుతోందన్నారు. ప్రభుత్వం ప్రాముఖ్యత గల అంశాల పైన చర్చకు రావడం లేదన్నారు.
సభ సజావుగా సాగేందుకు ఇంత వరకు ప్రతిపక్షాల సహకారమే కోరలేదని మండిపడ్డారు. పూర్తిస్థాయిలో మెజార్టీ ఇచ్చి తెరాసను అధికారంలోకి తెచ్చినప్పటికీ వలసలను ప్రోత్సహించడమేమిటని విమర్శించారు. వలసలను ప్రోత్సహిస్తే తెరాస పైన ప్రజలు విరక్తి చెందుతారన్నారు. తెరాస ప్రభుత్వం ప్రచారం వచ్చే అంశాల పైన చర్చిస్తోందన్నారు. అన్ని పద్దుల పైన చర్చించాకే బడ్జెట్ ఆమోదం పొందాలన్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలన్నారు.












Click it and Unblock the Notifications