ఏపీకి అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో వానలు జోరుగా కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మూడు రోజుల పాటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈదురు గాలులు వీయడంతోపాటు అక్కడక్కడా పిడుగులు పడతాయి.
ఈ నెల 4న అనకాపల్లి, అల్లూరి, మన్యం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. 5వ తేదీన అనకాపల్లి, అల్లూరి, మన్యం, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీ నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది.. 9వ తేదీకి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. 10వ తేదీకి తుఫాన్‌గా మారనుందని, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

తిరుపతి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరుతో పాటూ మిగిలిన జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులు వర్ష సూచన ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన ప్రారంభమైంది. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని, మళ్లీ వర్షం కురిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులవద్ద తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications