డయాబెటిస్ కేసులు తెలంగాణా కంటే ఏపీలోనే తక్కువ: ఐసీఎంఆర్ నివేదిక!!
తాజాగా దేశంలో మధుమేహం వ్యాప్తి ఏ విధంగా ఉందో ఐసీఎంఆర్ అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ షాకింగ్ నివేదికలో భారతదేశంలో పెను ప్రమాదం ముంచుకొస్తుందని, భవిష్యత్ లో భారత్ లో మధుమేహం బారిన పడేవారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుందని పేర్కొంది.
ప్రస్తుతం తాజా నివేదిక ప్రకారం నూట ఒక్క మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. నాలుగేళ్ల కాలంలో 44% మధుమేహం కేసులు పెరిగాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. సరైన జీవన శైలి లేకపోవటం, వ్యాయామం చెయ్యకపోవటం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటంతో ఎక్కువ మంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు.

ఇక అనేక రాష్ట్రాలలో మధుమేహం తీవ్రతను చెప్పిన ఐ సి ఎం ఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో డయాబెటిస్ డేటా ఏవిధంగా ఉందో వెల్లడించింది. డయాబెటిస్ కేసులు తెలంగాణా కంటే ఏపీలోనే తక్కువని నివేదిక పేర్కొంది. మధుమేహం ప్రబలతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానంలో ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 0.5 శాతం మందికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడించింది.
ఇక తెలంగాణ రాష్ట్రం 17వ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్రంలో 3.9 శాతం మందికి మధుమేహం ఉన్నట్టుగా ఐసీఎంఆర్ నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో మొత్తం 11.4 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు అయిన తెలుగు రాష్ట్రాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
మధుమేహం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన గోవా, ఢిల్లీ, చండీఘడ్, పుదుచ్చేరి లు తొలి స్థానాలలో ఉన్నట్టుగా నివేదిక పేర్కొంది.తెలుగు రాష్ట్రాలలో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నట్టు ఐసీఎంఆర్ నివేదికను బట్టి అర్థమవుతుంది. ఇక మధుమేహంతో పాటుగా బీపీ, ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్ సమస్య కూడా ఎక్కువ మందిలో గుర్తించినట్టు ఐసీఎంఆర్ నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని స్పష్టం చేస్తుంది. ప్రతీ ఒక్కరు డయాబెటిస్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పేర్కొంది.












Click it and Unblock the Notifications