టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రిలీజ్ ముహుర్తం వెనుక ? చంద్రబాబు విడుదలతో లింక్ !
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిస్ధితుల్లో టీడీపీ-జనసేన మరింత దగ్గరయ్యాయి. చంద్రబాబును జైల్లో పరామర్శించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై ప్రకటన చేశారు. తాజాగా ఆ పార్టీతో సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేయడంతో పాటు అందులో మ్యానిఫెస్టో విడుదలపై సైతం కీలక ప్రకటన చేసేశారు. నిన్న లోకేష్ ప్రకటన ప్రకారం చూస్తే నవంబర్ 1న ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు మొగ్గు చూపడం వెనుక కారణాలేంటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే దసరాకు మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించిన టీడీపీ.. చంద్రబాబు అరెస్టుతో దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలాగే జనసేన కూడా మ్యానిఫెస్టోను దాదాపుగా సిద్ధం చేసేసుకుంది. ఈ రెండింటినీ క్లబ్ చేసి ఉమ్మడి మ్యానిఫెస్టోను దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు నవంబర్ 1న మ్యానిఫెస్టో విడుదల కాబోతోంది. అనంతరం దీన్ని ఇరు పార్టీలు ఇంటింటికీ తీసుకెళ్తాయని పవన్, లోకేష్ వెల్లడించారు.

అయితే దసరా ముహుర్తం మిస్సయిన నేపథ్యంలో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే మ్యానిఫెస్టో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నవంబర్ 1న ఈ ముహుర్తం పెట్టుకోవడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. అదే చంద్రబాబు జైలు నుంచి విడుదల.
స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్ లో ఉంది. ఇది వచ్చే వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. అందులో చంద్రబాబు కోరినట్లుగా స్కిల్ కేసును సుప్రీంకోర్టు క్వాష్ చేస్తే సరి. లేకపోతే మధ్యంతర బెయిల్ అడిగి జైలు నుంచి విడుదలయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎలాగో నవంబర్ 1 లోపు చంద్రబాబు బయటికి రావడం, మ్యానిఫెస్టోను పవన్ తో కలిసి విడుదల చేయడం జరిగిపోతాయి. అందుకే నవంబర్ 1 ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications