తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ..ఏపీలో ఏం జరగబోతోంది ?
తెలంగాణలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీదే విజయమని తేల్చేశాయి. కనీసం బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశాయి. అధికార బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు షాకిచ్చాయి. ఎగ్డిట్ పోల్స్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమే. అలాగే ఈ పరిణామం ఏపీపైనా ప్రభావం చూపబోతోంది.
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో సెటిలైన ఆంధ్రా ఓటర్లు కూడా ఇన్నాళ్లూ టీడీపీ విషయంలో, చంద్రబాబు విషయంలో పెద్దగా అనుకూలత చూపకపోయినా ఆయన అరెస్టు తర్వాత హైదరాబాద్ లో జరిగిన నిరసనల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఇదే బీఆర్ఎస్ కొంప ముంచిందన్న విశ్లేషణలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే ఆ ప్రభావం ఏపీపైనా పడటం ఖాయం.

ఏపీలో ప్రస్తుతం వైసీపీ వర్సెస్ విపక్షాల రాజకీయం నడుస్తోంది. ఇందులో విపక్ష టీడీపీ-జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రెండు పార్టీలతో పొత్తు విషయంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తే ఏపీలో టీడీపీ-జనసేనతో పొత్తుకు బీజేపీ వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్ తో కలిసేందుకు కూడా టీడీపీ-జనసేన ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు.
సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధలతో ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే బీజేపీవైపే టీడీపీ-జనసేన మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా కాదని కేంద్రంలోనూ పరిస్ధితులు మారతాయన్న లెక్కలు వేసుకుంటే మాత్రం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో కలిపి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో ఎంపీ సీట్లకు కూడా డిమాండ్ పెరగబోతోంది. అప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయి. అంతిమంగా ఈ పరిణామాలన్నీ ఏపీలో అధికార వైసీపీకి మైనస్ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications