జగన్ కు అల్టిమేటం ఇచ్చేసిన దువ్వాడ ? టికెట్ ఇవ్వకపోతే..!
ఏపీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (duvvada srinivas) భవిష్యత్ రాజకీయంపై చర్చ జరుగుతున్న ఆయన ఇవాళ ఉన్నట్లుండి అసెంబ్లీ కు హాజరై.. పార్టీ అధినేత వైఎస్ జగన్ (ys jagan)ను కలిశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం బయటికి వచ్చేశారు. ఆ సమయంలోనే లాబీల్లో జగన్.. దువ్వాడను పిలిపించారు. దీంతో దువ్వాడ జగన్ కాళ్లకు మొక్కారు.
అనంతరం వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూనే అసెంబ్లీ బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్-దువ్వాడ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఏం చేద్దామనుకుంటున్నావ్ శ్రీనివాస్ అంటూ జగన్ ఆప్యాయంగా దువ్వాడను అడిగారు. దీనికి సమాధానంగా తమ జిల్లాలో ధర్మాన సోదరులతో ఉన్న వివాదాలను ప్రస్తావించారు. వారి వల్లే తనను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. ఇందులో తన తప్పేమీ లేదన్నారు. దీంతో కాసేపు వాటిని విన్న జగన్.. ఆ తర్వాత తనను వచ్చి కలవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం అసెంబ్లీ బయట దువ్వాడ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్ చాట్ చేశారు. ఇందులో జగన్ తిరిగి పార్టీలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే, స్వతంత్రంగానే పోటీ చేసి తన బలం చూపిస్తానని వెల్లడించారు. అప్పటివరకూ మండలిలో తన వాణి వినిపిస్తానన్నారు. త్వరలో పార్టీ అధినేత జగన్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని దువ్వాడ చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను భక్తుడివైపే మాట్లాడతానని చెప్పారు. అలాగే మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications