నంద్యాల: బిజెపికి దూరంగా టిడిపి, వైసీపీ కొంపముంచిందా?
నంద్యాల:నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టిడిపి అనుసరించిన వ్యూహం సత్పలితాలను ఇచ్చింది. నంద్యాల ఉపఎన్నికల్లో మిత్రపక్షం బిజెపి సహయం లేకున్నా విజయం సాధించింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో జనసేన తటస్థంగా ఉంటామని ప్రకటించింది. ఈ రెండు పార్టీల మద్దతు లేకున్నా టిడిపి 27 వేల ఓట్ల మెజారిటీతగో విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడంలో టిడిపి విజయం సాధించింది.
గోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారు
నంద్యాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీని అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ కూడ దక్కలేదు. నోటా కంటే స్వల్ప ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు దక్కాయి.
''జగన్ చెప్పినట్టుగానే నంద్యాల తీర్పు, రాజకీయ సన్యాసంపై శిల్పా మౌనం వీడాలి''
అయితే వైసీపీ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ముస్లిం మైనార్టీలు నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచారని ఫలితం ఆధారంగా తేటతెల్లమౌతోంది.నంద్యాల పట్టణంలో టిడిపికి మంచి మెజారిటీ వచ్చింది.
''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''
వైసీపీకి పట్టున్న వార్డుల్లో కూడ టిడిపి ఆధిక్యతను సాధించింది. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి కలిసివస్తాయి. అయితే మూడేళ్ళ టిడిపి ప్రభుత్వ పాలనపై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారని వైసీపీ నేతలు భావించారు, కానీ, వైసీపీ ఆశలను నంద్యాల ఓటర్లు వమ్ము చేశారు.

ముస్లింలు టిడిపికి మద్దతుగా నిలిచారు
నంద్యాల ఉపఎన్నికల్లో ముస్లింలు వైసీపీ, కాంగ్రెస్ పార్టీల అంచనాలను తలకిందులు చేశారు. అసాధారణ రీతిలో అఽధికార పక్షానికి మద్దతుగా నిలిచారు. మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల ఓట్లను లెక్కించినప్పుడు అధికార పార్టీకి భారీ మెజారిటీ నమోదైంది. అది ఇతర ప్రాంతాలకంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి పట్టణ ప్రాంతంలో 20,516 ఓట్ల మెజారిటీ వచ్చింది. పట్టణంలోని వార్డులలో పోలైన ఓట్లను 11 రౌండ్లలో లెక్కించారు.పాత పట్టణంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల ఓట్లను 3,4,5,6 రౌండ్లలో లెక్కించారు. మొత్తం 19 రౌండ్లలో ఈ నాలుగు రౌండ్లే టీడీపీకి అత్యధిక మెజారిటీని నమోదు చేశాయి. ఈ నాలుగు రౌండ్లలో 13,447 ఓట్ల మెజారిటీని టీడీపీ అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి సాధించారు. అంటే... సగటున ఒక్కో వార్డులో 3,362 ఓట్ల మెజారిటీ వచ్చింది.

ఎన్‌డిఏకు దగ్గరయ్యారనే సంకేతాలు వైసీపీని దెబ్బతీసిందా?
. ముస్లింలలో బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఈసారి వైసీపీపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో సాన్నిహిత్యానికి వైసీపీ అధినేత జగన్ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. జగన్ మోదీతో భేటీ కావడం, రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి మద్దతు పలకడం ముస్లింలు, క్రిస్టియన్లలో వ్యతిరేక ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ముస్లింలలో ఓ వర్గం శిల్పా మోహన్‌రెడ్డిపై గుర్రుగా ఉంది. దీన్ని టీడీపీ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. ఆ వర్గాలకు చెందిన వారిపై ఉన్న కేసులను తీసివేయించి వారి నమ్మకాన్ని చూరగొంది. ఆ వర్గాలకు చెందిన నేతలు ఫరూక్, నౌమాన్ వంటి వారికి ఉన్నతస్థాయి రాజకీయ పదవులను ఇవ్వాలన్న నిర్ణయం కూడా టీడీపీకి కలిసొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో అభివృద్ధి జరుగుతుండటం కూడా ముస్లింలను టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేసింది.

బాబు ప్రచారం కలిసి వచ్చిందా?
ఎన్నికలకు మూడు రోజుల ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ముస్లిం మైనార్టీల సమావేశంలో బాబు ప్రసంగించారు.శాసనమండలి ఛైర్మెన్ పదవిని ముస్లింలకే కేటాయించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు పలు సామాజికవర్గం నేతలతో కూడ బాబు సమావేశాలు నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి మద్దతివ్వాలని కోరారు.టిడిపి నేతలకు ఆయా సామాజికవర్గాలు మద్దతుగా నిలిచాయని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

కలిసివచ్చిన బాబు వ్యూహం
నంద్యాల ఉప ఎన్నికను పురస్కరించుకొని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా వ్యవహరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతిస్తారని భావించారు. కానీ, ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని పవన్ ప్రకటించారు. బిజెపి కూడ ఈ ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం నిర్వహంచలేదు. నంద్యాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో బిజెపి నేతలను ప్రచారానికి దూరంగా ఉంచడంలో టిడిపి వ్యూహత్మకంగానే వ్యవహరించింది.అయితే ఈ విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో వైసీపీ వైఫల్యం చెందింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!