ఎందుకు జాప్యం చేస్తున్నారు: జగన్ జంకుతున్నారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కార్యాలయాన్ని నూతన తాత్కాలిక రాజధాని వెలగపూడికి మార్చుకున్నారు. కానీ, ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్రయత్నాలేవీ చేస్తున్నట్లు లేరు. విజయవాడకు తన కేంద్ర కార్యాలయాన్ని మార్చేందుకు జగన్ జంకుతున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో గింగుర్లు కొడుతోంది.
విభజన జరిగిన ఏడాదిన్నర వరకూ చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి పాలిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తూ వచ్చింది. కానీ జగన్ మాత్రం హైదరాబాదు నుంచి విజయవాడ మారేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుంది.
విభజన జరిగి, ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా బెజవాడకు తరలివెళ్లారు. అటు తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కూడా విజయవాడలోో తమ రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకుంది. కానీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ఇప్పటివరకూ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర కార్యాలయం కాలేదు.

చంద్రబాబుపై ఇలా విమర్సలు
చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గతంలో విమర్శల దాడి చేశారు. ఆస్తుల పరిరక్షణ కోసమే బాబు హైదరాబాద్ విడిచివెళ్లడం లేదని ఆరోపించారు.

చంద్రబాబు హైదరాబాద్ నుంచి మారారు..
చంద్రబాబు తన మకాం విజయవాడకు మార్చారు. తన కార్యాలయాన్ని కూడా వెలగపూడిలో ఏర్పాటు చేసుకుని అందులోకి ప్రవేశించారు. ఆయన చాలా కాలంగా విజయవాడ నుంచే పరిపాలన సాగిస్తూ వస్తున్నారు. ఎప్పుడో గానీ ఆయన హైదరాబాదు రావడం లేదు.

ఉద్యోగులు కూడా మారారు....
సచివాలయ ఉద్యోగులు కూడా దసరాకు ముందే మూకుమ్మడిగా వెలగపూడికి తరలివెళ్లారు. క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ శాఖలన్నీ విజయవాడ ప్రాంతానికి తరలి వెళ్లాయి. ఉద్యోగులు కూడా అక్కడికి తరలి వెళ్లారు. తొలుత కాస్తా మొరాయించినప్పటికీ అందరూ తరలి వెళ్లారు.

వైయస్ జగన్ జంకుతున్నారా...
సామాజిక కోణంలోనే విదయవాడకు తరలివెళ్లేందుకు వైయస్ జగన్ భయపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని, ఇప్పటికే అలాంటి చర్చ జరుగుతోందంటున్నారు. జగన్ పార్టీ సమీక్షలు, కార్యక్రమాలు, మీడియా సమావేశాలన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగుతున్నాయి. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు.

జగన్ చెప్పినా కూడా...
విజయవాడ, గుంటూరులో ఏదో ఒకచోట పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం స్థలం చూడాలని జగన్ తన పార్టీ నేతలకు ఏడాది క్రితమే జగన్ సూచించారు. జగన్ ముందు సరేనన్న నేతలు ఆ తర్వాత ఆ విషయాన్ని పక్కకుపెట్టారు. ఆఫీసు స్థలం, నిర్మాణ బాధ్యతలను తీసుకుంటే, దాని ఖర్చుల భారం కూడా ఎక్కడ తమ నెత్తిన పడుతుందోనన్న భయంతో నేతలు తప్పించుకు తిరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ కూడా ఆ ఖర్చును తాను భరిస్తానని చెప్పకపోవడమే వారి భయానికి కారణమని అంటున్నారు.

ఎందుకు తగ్గారో మరి....
ఒకదశలో విజయవాడలో జగన్ మీడియా ఆఫీసు పక్కనే ఉన్న స్థలంలో ఆఫీసు నిర్మిద్దామని భావించినప్పటికీ ఎందుకో ఆ ప్రయ త్నం కూడా నెరవేరలేదంటున్నారు. ఇందుకు గల కారణాలేమిటనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications